HudHud Cyclone : విశాఖలో హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు..

విశాఖపట్నం.. ఓవైపు సముద్రతీరం.. మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటి సిటీపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడింది. నగరమంతా కకావికలమైంది. ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. విశాఖలో హుద్ హుద్ సృష్టించిన బీభత్సానికి పదేళ్లు నిండాయి.

విశాఖపై హుద్‌ హుద్‌ తుపాను విరుచుకుపడి పదేళ్లు అయ్యింది. సరిగ్గా 2014 అక్టోబరు 12న తీరం దాటిన హుద్ హుద్ కుండపోత వర్షాలు కురిపించింది. దాని తీవ్రతతో దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. మునుపెన్నడూ చూడని విలయాన్ని సృష్టించాయి. అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. అప్పటి వరకూ నీడనందించిన భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. బయటి ప్రపంచంతో విశాఖకు సంబంధాలు లేకుండా చేసింది హుద్ హుద్.

ఎయిర్‌పోర్ట్ మొదలు.. బీచ్ రోడ్డు వరకూ అన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాం, సమచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. విశాఖ ప్రజలు మనోధైర్యం కోల్పోయారు. ఇక విశాఖ నగరం కోలుకోవడం కష్టమే అనే భావన ఏర్పడింది.