Cyclone Dana: దూసుకు వస్తున్న ‘దానా’.. వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో మరో  అల్పపీడనం ఏర్పడింది. అది ఈరోజు తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపానును ‘దానా’గా పేరుపెట్టారు. దీంతో  ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.  రేపు (గురువారం) అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటవచ్చని వాతావరణ అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ తుపాను ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని ఐఎండీ మాజీ డీజీ డాక్టర్ కేజే రమేశ్ తెలిపారు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.