తీరం దాటినా దానా తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. తుఫాన్ ధాటికి ఒడిశా, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను తీరందాటే సమయంలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. తుపాను దెబ్బకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి.
ముందు జాగ్రత్తగా ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించారు. పశ్చిమ బెంగాల్‌లో 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా బెంగాల్, ఒడిశాలో 300 విమానాలు, 552 రైళ్లు రద్దు చేశారు. తుఫాన్ తీరం దాటడంతో.. ఏపీలోని కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ, యానాం, రాయలసీమలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాన్ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపించనుంది. శనివారం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది.