రుషికొండ భవనాల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు పూర్తిగా అక్రమం, నిబంధనలకు వ్యతిరేకం అని, అందరూ ఎగిరిపోతారు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. రుషికొండపై నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం వందల కోట్లు పెట్టి రుషికొండ భవనాలు నిర్మించారు. ఏ ఒక్క నిబంధన కూడా పాటించలేదు. ఇది ముమ్మాటికీ నేరమే. ఈ నేరంలో భాగమైన వారికి శిక్షపడాల్సిందే. విచారణ చేపట్టి అందరినీ బయటకు లాగుతామంటున్నారు సీఎం చంద్రబాబు.
ప్రకృతిని విధ్వంసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండ భవనాలను నిర్మించారని పేర్కొన్నారు. కోర్టును కూడా తప్పదోవ పట్టించారన్నారు. ఇప్పుడు అసలు వాస్తవాలు కోర్టు ముందు ఉంచుతామంటున్నారు. పూర్తిగా విచారణ చేస్తే ఈ కేసులో చాలామంది ఎగిరిపోతారని అంటున్నారు సీఎం చంద్రబాబు. కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని భవనాలు కట్టారు. కోర్టులు, కేంద్రాన్ని కూడా మభ్యపెట్టి.. నిబంధనలన్నీ ఉల్లంఘించి.. మంచినీళ్లలా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఈ భవనాల విషయంలో నేరం జరిగిపోయింది. ఇక శిక్ష వేయడమే మిగిలి ఉందన్నారు.