వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ అధినేత జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇది అందరినీ ఆశ్చర్యపర్చింది. గతంలో ఆ పార్టీలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీపై చాలా విమర్శలు చేశారు. అదే అవంతి జగన్ ను విమర్శించడమే కాకుండా. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అదే అనేక సందేహాలకు తావిస్తోంది.
ఆయన ఏం మాట్లాడారంటే..
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదు.. కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలి.. ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలా.. అని ప్రశ్నించారు. అంతే కాదు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని, ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నో పథకాలను అమలు చేసి కూడా ఎన్నికల్లో ఓడిపోయామంటే… తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని జగన్ కు హితవు పలకడం చాలా కీలకంగా మారింది. పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని… క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు.
చిరంజీవిపై ఉన్న అభిమానంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని… నిజయతీగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అవంతి వ్యాఖ్యలు వెనుక కీలక నిర్ణయం తీసుకున్నారనే సందేహాలు వెల్లడవుతున్నాయి.