Anitha: జగన్ వల్లే గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది: హోం మంత్రి అనిత

మాజీ సీఎం జగన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే గంజాయి, డ్రగ్సు సమస్య అధికమైందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని, అందువల్లే దుండగులు రెచ్చిపోయారని అన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని తెలిపారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ ను కోరారు.