Andhra Pradesh: అమలులోకి కొత్త చట్టాలు.. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి తీర్పు

కొత్తచట్టాలు అమలులోకి వచ్చాయి. అది ఆంధ్రలోనే ప్రారంభం కావడం విశేషం. ప్రకాశం జిల్లాలోని కనిగిరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి కె .భరత్ చంద్ర శుక్రవారం దొంగతనం కేసులో సామాజిక సేవా శిక్ష (కమ్యూనిటీ సర్వీస్) ను విధిస్తూ తీర్పునిచ్చారు.  ప్రకాశంజిల్లా కనిగిరికి చెందిన పోల అంకయ్య నవంబర్ 2 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కనిగిరి ప్రధాన కూడళ్లను, వీధులను శుభ్రపరిచే పనుల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ పనిని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో చేయాలని న్యాయమూర్తి  ఆదేశాలు జారీ చేశారు.

2024 అక్టోబర్‌ 13న కనిగిరి దొరువు బజార్ లోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో చోరీ జరిగింది. భక్తులు పూజలో ఉండగా సాయంత్రం 4:30 గంటల సమయంలో నిందితుడు అంకయ్య ఆలయంలోకి ప్రవేశించి మూడు ఇత్తడి కలశాలను చోరీ చేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే  పోలీసులు వచ్చి నిందితుడు అంకయ్యను అదుపులోకి తీసుకుని, చోరీ చేసిన  ఇత్తడి కలశాలను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తు చేసిన  ఎస్ఐ టి. శ్రీరామ్ నిందితుడి పై  భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 303 (2), 324(3) కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు శుక్రవారం హాజరుపరచగా కనిగిరి న్యాయమూర్తి ఈ తీర్పును అమలు చేశారు.