- అన్నదాతకు అండగా వైసీపీ పేరిట నిరసనలు
- ధాన్యం బస్తాలతో ఫొటోషూట్లంటూ వ్యంగ్యాస్త్రాలు
- తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్న మంత్రి నాదెండ్ల
విపక్ష పార్టీ వైసీపీ నిర్వహించిన నిరసనలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. అన్నదాతకు అండగా వైసీపీ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలే కలెక్టరేట్ల దగ్గరకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లి ఫొటోషూట్లు చేశారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు, అనంతపురం, ప్రకాశం, విశాఖ, అనకాపల్లి జిల్లాలలో కనీస సేకరణ కూడా చేపట్టలేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రైతులకే పెద్దపీట వేస్తున్నారని మంత్రి నాదెండ్ల అన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం కూటమి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రాకముందే అన్నదాతల కళ్లల్లో సంతోషం కనిపిస్తోందన్నారు. ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ధాన్యం విక్రయాల విషయంలో ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.