- రాజకీయాల్లోకి మంచు మనోజ్ – మౌనిక దంపతులు?
- పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన..
- జనసేన పార్టీలో చేరతారంటూ టాక్
సినీ నటుడు మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం చేయనున్నారంటూ ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనిక పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మోహన్ బాబుతో కుమారుడు మనోజ్ గొడవలు, మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి, ఆస్పత్రిలో చేరిక ఇలా పలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మంచు మనోజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారంటూ ఓ వార్త వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భార్య మౌనికతో కలిసి దీనిపై ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.
మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభ. వీరి అకాల మరణం తరువాత ఆమె సోదరి అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. మరోవైప మోహన్ బాబు కుటుంబానికి కూడా రాజకీయాల్లో మంచి సంబంధాలు ఉండేవి. రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. తరువాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి మోహన్ బాబు తరహాలోనే మనోజ్ కూడా రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్నారట. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు ఉండటంతో జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు వెళ్లనున్న మనోజ్ – మౌనిక దంపతులు తమ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.