కాకినాడ పోర్ట్ వ్యవహారం ఈడీ తేల్చేస్తుందా ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలలో కాకినాడ పోర్ట్ , కాకినాడ సెజ్ వాటాల అమ్మకాలు , కొనుగోళ్లలో జరిగిన గోల్ మాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ అక్రమ వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించింది .  కాకినాడ పోర్ట్స్, సెజ్ యాజమాన్యాలను బెదిరించి కంపెనీ వాస్తవ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు సిఐడి కి వెళ్లిన ఫిర్యాదుల నేపథ్యంలోనూ ఈ అంశాలపైనే ఈడీ ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు సమాచారం .

కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కెఎస్‌పిఎల్), కాకినాడ సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో మెజారిటీ వాటాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలతో  ఇప్పటికే ఏపీ cid కేసు నమోదు చేసిన విషయం విదితమే .

KSPLలో 41.12% వాటాను కొనుగోలు చేసినందుకు గాను కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కెఐహెచ్‌ఎల్)కి ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (అరోబిందో కంపెనీ) చెల్లించిన రూ. 494 కోట్లపై విచారణలో దృష్టి సారించిన ఈడీ అధికారులు  కొన్ని ఆధారాలు సేకరించారు.   

విక్రాంత్ రెడ్డి ద్వారా . .  

    కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (KSPL)లో వాటా కావాలని విక్రాంత్ రెడ్డి ద్వారా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను బెదిరించారని కాకినాడ సి పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ కెవి రావ్  AP CID అధికారులకు  2024 డిసెంబర్ 4 వ తేదీన  ఫిర్యాదు చేశారు. కెవి రావ్ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సిఐడి అధికారులు కాకినాడ పోర్ట్, సెజ్ రికార్డులు, అరబిందో కంపెనీ లావాదేవీలను పరిశీలించేందుకు రంగంలోకి దిగారు. 2020 మే నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ఈ దందాలు జరిగాయన్న కేవీ రావు రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సీఐడీకి వివరించారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కేసు నమోదుచేసిన సీఐడీ విక్రాంత్‌రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్ఎల్​పీ ఆడిట్‌ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను సిఐడి  నిందితులుగా చేర్చింది. 

 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు విక్రాంత్ రెడ్డితో పాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించాలని ED ఇప్పటికే నోటీసులు జరీ చేసింది . KSPL యొక్క ఎగవేతను తక్కువగా అంచనా వేయడానికి మరియు అన్యాయంగా తక్కువ ధరకు లావాదేవీని సులభతరం చేయడానికి రాజకీయ  ఒత్తిళ్లతో ఆడిట్ నివేదిక తారుమారు చేయడానికి పన్నిన కుట్ర అంశం కూడా ఈడీ దృష్టికి వచ్చింది .

PKF శ్రీధర్ మరియు సంతానం LLP పాత్ర. 

KSPL యజమాని కెవి రావ్ నుంచి పోర్ట్, సెజ్ వాటాలను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కంపెనీ ఆడిట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బెదిరించారని CID కేసులో నమోదు చేసింది.   సంస్థ యొక్క ప్రాథమిక నివేదికలో రూ. 965 కోట్ల ఎగవేత జరిగినట్లు PKF శ్రీధర్, సంతానం LLP సంస్థలు ఆడిట్ రిపోర్టులు ఇచ్చాయి.  పోర్టు వాటాలు బదిలీ అయిన తర్వాత ఇవే కంపెనీలు .. ఆడిట్ నివేదికను అనూహ్యంగా సవరించారు. రు 965 కోట్ల ఎగవేత నుంచి.. అది..  రూ. 9.03 కోట్లకు సవరించబడింది. ఈ విషయాన్నీ సీఐడి గమనించింది. 

‘’ కేఎస్​పీఎల్​ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్‌ సంస్థ నివేదిక సమర్పించిందని, దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారని కెవి రావు  సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు.. కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.  

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో ఫోన్‌ చేసి కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారని కేవీ రావు తన ఫిర్యాదులో వివరించారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి సోదరుడు, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్రాంత్‌రెడ్డి కాల్‌ చేసి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి రమ్మంటే వెళ్లానని చెప్పారు. స్పెషల్‌ ఆడిట్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్​పీఎల్ రూ.1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్‌రెడ్డి చెప్పారని కేవీ రావు వెల్లడించారు.

ఈ కేసులో నిందితులైన పీకేఎఫ్​ శ్రీధర్ అండ్ సంతానం ఎల్​ఎల్​పీ ఆడిట్ సంస్థ ప్రతినిధులను ఈడీ అధికారులు తాజాగా సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌ రూ.965 కోట్లు ఎగవేసిందంటూ ఏ ప్రాతిపదికన నివేదిక సమర్పించారో వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ సంస్థలోని వాటాలు అరబిందో పరం కాగానే ఎగవేతను రూ9.3 కోట్లకు తగ్గించేస్తూ ఎలా నివేదిక రూపొందించారని ప్రశ్నించగా వారు మౌనం వహించినట్లు   తెలిసింది.

  కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌-కేఎస్​పీఎల్​లో కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-కేఐహెచ్‌పీఎల్​కు 41.12 శాతం వాటాతో రూ.2,15,50,905 షేర్లు ఉండేవి.

కేఎస్​పీఎల్​ 2014-15లో రూ.491.47 కోట్లు, 2015-16లో రూ.421.32 కోట్లు, 2016-17లో రూ.417.69 కోట్లు, 2017-18లో రూ.439.57 కోట్లు, 2018-19లో రూ.576.53 కోట్లు, 2019-20లో రూ.628.71 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2019-20 నాటికి రూ.240 కోట్ల నగదు నిల్వలున్నాయి. 

కాకినాడ సెజ్‌కు పిఠాపురం, కొత్తపల్లి మండలాల పరిధిలో..  పొన్నాడ, మూలపేట, రమణక్క పేటల్లో 8320 ఎకరాల భూములున్నాయి. అందులో కేఐహెచ్‌పీఎల్​కు, కేవీఆర్‌ గ్రూప్​నకు 48.74 శాతం వాటా ఉండగా మిగతా వాటా జీఎంఆర్​ది.

 మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలు 

 కేఎస్​పీఎల్​లో కేఐహెచ్​పీఎల్​కు 41.12 శాతం వాటా, వ్యక్తిగతంగా తనకు 20 షేర్లు మాత్రమే ఉన్నాయని విక్రాంత్​రెడ్డికి చెప్పినట్లు కేవీ రావు పేర్కొన్నారు. అయితే తన కోసం వాటాలు బదలాయించాలని అడగడం లేదని, వాటిని సీఎం జగన్‌ కావాలనుకుంటున్నారని విక్రాంత్‌రెడ్డి తనతో చెప్పారని వివరించారు. అంగీకరించకపోతే,  మీరు, మీ కుటుంబసభ్యులు క్రిమినల్‌ కేసులు, విజిలెన్స్‌ విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

రూ.12 కోట్లకే లాక్కున్నారు :

 కాకినాడ సెజ్‌లోని 48.74 శాతం వాటాలనూ తమ నామినీల పేరిట బదిలీ చేయాలని విక్రాంత్‌రెడ్డి 2020 మే నెలలో బెదిరించారని కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.12 కోట్లకు వాటాలు అమ్ముతున్నట్లు ఒప్పందపత్రం రూపొందించి తమ చేత 2020 అక్టోబర్ 12న బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వాటాల బదిలీ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్‌లో వాటాదారుగా మారిందని చెప్పారు. అదే సమయంలో కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌ గ్రూప్​నకు ఉన్న వాటాను కూడా అరబిందో కొనేసిందన్నారు. దీంతో మొత్తం 100 శాతం వాటాలు అరబిందో పరమయ్యాయని చెప్పారు కెవి రావ్.   కాకినాడ సెజ్‌కు అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్స్‌ లిమిటెడ్‌ కూడా వారి సొంతమైందన్నారు. ఇప్పటికే సీఐడి దర్యాప్తు లో చాలా వరకు నిజాలు నిగ్గుతేలాయ్ . వీటి ఆధారంగాను , మరింత విచారణంతోనూ ఈడీ కూడా ఈ అక్రమాలను తేల్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది . ఈ కేసులో జగన్ కూడా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది .

  ==================