ఏపీ కేబినెట్ భేటీ.. రాజధాని పునర్ నిర్మాణంపై చర్చ

  • ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం
  • రాజధానిలో చేపట్టాల్సిన పనులపై చర్చ
  • కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

అమరావతి పునర్ నిర్మాణంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి పనులను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా సీఆర్డీఏ ఆథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల పనులకు అనుమతులపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. కేపిటల్ నిర్మాణం కోసం ఆమోదం తెలిపిన లే అవుట్, ట్రంక్ రోడ్లలో మౌలిక వసతుల కల్పన మరియు ఐకానిక్ బిల్డింగులకు సంబంధించి మొత్తం రూ.24,276 కోట్ల పాలనా పరమైన ఆమోదం కోసం ఇది కేబినెట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సుమారు 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానున్న అసెంబ్లీ భవనానికి అనుమతులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దాంతోపాటు 20 లక్షల 32 వేల చ.అ విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణం కూడా కేబినెట్ ముందుకు ఆమోదం కోసం రానుంది. వీటితో పాటు జీఎడీ, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మించనున్నారు. ఈ ఐదు టవర్లకు రూ.4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం ముందుకు రానున్నాయి.