ఏదో ఒక పార్టీ .. కూటమి పార్టీల వైపు వైసీపీ నేతల చూపు . .

టీడీపీ కాదంటే జనసేన . . వాళ్ళూ వద్దంటే బీజేపీ . . వైసీపీ అధికారంలో ఉన్నపుడు అక్రమాలు , అరాచకాలకు పాల్పడిన నేతలు . . వాటి నుంచి తప్పించుకునేందుకు అధికార కూటమిలో చేరిపోతున్నారు . కూటమి నేతలు సైతం వారించలేక వాపోతున్నారు . .

వందల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొనంటున్న విశాఖ డెయిరీ చైర్మన్ , డైరెక్టర్స్ వైసీపీకి రాజీనామా చేసి . . టీడీపీ , జనసేనలతో బేరాలకు దిగారని . . ఈ రెండు పార్టీలు ఒప్పుకోకపోతే . . వాళ్ళు బీజేపీలో చేరిపోయి . . విచారణ నుంచి తప్పించుకునే పన్నాగం పన్నినట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటీవల చర్చ సాగింది .

లాభసాటి పనుల కోసం  టీడీపీ, జనసేనలలో చేరేందుకు  వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

          వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఐదేళ్లపాటు అధికారం అనుభవించి, అనేక లాభసాటి పనులు చేసుకున్న నేతలు, టీడీపీ, జనసేన పార్టీలలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

       ఈ చేరికలను  రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ, జనసేన కేడర్ వ్యతిరేకిస్తున్నా, నిలువరించలేకపోతున్నారు.  

   నెల్లూరు నగరంలో 9 మంది, ఏలూరు సిటీలో 11 మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. రెండు నెలల క్రితం చేరిన ఈ వైసీపీ నాయకుల వెనుకున్న కేడర్ స్థానికంగా గ్రావెల్, మట్టి తదితర వ్యాపారాలలో చొరబడ్డారు. 2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నపుడు చేసిన కొన్ని అక్రమ వ్యాపారాలు కూడా టీడీపీలో చేరిన తర్వాత కొనసాగిస్తున్నట్లు స్థానిక టీడీపీ కేడర్ ఆరోపిస్తోంది. 

‘’అధికారంలో ఉన్నన్నాళ్లు దోచుకున్నారు. ఆ దోపిడీ కొనసాగడానికి టీడీపీలో చేరారు. ఇలాంటి వాటిని పార్టీ ప్రోత్సహించడం కరెక్ట్ కాదు..’’ అని రాజమండ్రికి కి చెందిన టీడీపీ నేత ఎన్ . రవి మోహన్   ‘’అభి న్యూస్ ‘  తో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 ఇలాంటి ఉదాహరణలో రాష్ట్ర వ్యాప్తంగా పలు  జిల్లాలలో కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారు. 

 మాజీ ఉప ముఖ్యమంత్రి చేరికపై టీడీపీ అభ్య0తరం.. 

    జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించిన ఏలూరుకి చెందిన  ‘ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని) ’ టీడీపీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే స్థానిక నేతలు అభ్య0తరంతో నాని చేరికకు తాత్కాలికంగా  బ్రేక్ పడింది. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ కేడర్ రెచ్చిపోయారు. పార్టీ అధిష్టానం నాని చేరిక విషయంలో  వెనుకంజవేయాల్సి వచ్చింది. 

జనసేనకు  బాలినేని అవసరం ఏమొచ్చింది? .

.”ఒంగోలులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2024 ఎన్నికల ముందు ఒక మహిళ ”జై వైసీపీ” అనలేదని దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు . ఆమెను పోలీసులు ఒంగోలు   గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు .  అయినా బాలినేని బ్యాచ్ వదలకుండా . . ఆసుపత్రిపై దాడికి వెళ్లారు .  ఈ బ్యాచును దగ్గరుండి తీసుకువెళ్ళింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,  ఆయన తనయుడు .  విశాఖపట్నం జిల్లాలో లాట్ రైట్ మైనింగ్ అక్రమ తవ్వకాలు ,  ఎగుమతులతో బాలినేని పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి . కూటమి  అధికారంలోకి వచ్చాక విచారణ చేసి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో కూటమి నేతలు ప్రగల్బాలు పలికారు . అధికారంలో ఉన్నపుడు తాను చేసిన అవినీతి ,  అరాచకాల నుంచి రక్షణ పొందేందుకు జనసేన సేఫ్ అని భావించిన బాలినేని . . పవన్ కళ్యాణ్ తో లాబీయింగ్ చేసుకుని పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .  అంతే అయన అరాచకాలు ,  అక్రమాలు ,  అవినీతి పక్కకుపోయాయ్’’ అని నెల్లూరు  జిల్లాకు  చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు “ అభిన్యూస్  ‘ తో మాట్లాడుతూ తన బాధను వెళ్లగక్కారు.  .

సామినేని ఉదయభాను చేరికతో టీడీపీ – జనసేన మధ్య విభేదాలు

‘ జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను  అధికారంలో బరితెగించాడు. అతను  భూ కబ్జాలు ,  అక్రమాలు ,  అరాచకాలు నుంచి తప్పించుకునేందుకు టీడీపీలో చేరాలనుకున్నారు. మేమంతా వారించడంతో  జనసేనను ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఇలాంటి వాళ్ళను టీడీపీ వద్దంటే జనసేన,, వాళ్ళు కుదరదంటే టీడీపీ.. కూటమి పార్టీల నైతికత ఏమవుతుంది? ‘’ అంటూ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు పార్టీ కేడర్ ఆవేదనను మంత్రి నారా లోకేష్ వద్ద వెలిబుచ్చారు. సామినేని జనసేనలో చేరిన తర్వాత టీడీపీ , జనసేన మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్లినట్లు చెపుతున్నారు . ల్యాన్డ్ సెటిల్ మెంట్ బ్యాచ్ లను మళ్ళీ రంగంలోకి దింపుతున్నారని కూడా జనసేన ,   టీడీపీ కార్యాలయాలకు  అనేక ఫిర్యాదులు వెళుతున్నాయి.  .

చంద్రబాబు, పవన్ అప్రమత్తం కావాలి . .   

‘ఐదేళ్ల పాటు అరాచకాలతో జనసేన ,  టీడీపీ   కార్యకర్తలను హింసలకు గురిచేసి కొన్ని చోట్ల ఆయా పార్టీల కార్యకర్తలపై హత్యలకు పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలలో కొందరు రక్షణ కోసం టీడీపీ,  జనసేనలలో చేరాలని ప్రయత్నిస్తున్నారు.   ఎన్నికల్లో జనం తరిమికొట్టిన వైసీపీ  నేతలను చేర్చుకుంటే కూటమి పార్టీల మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం…’ అని టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ ఒకరు విజ్ఞప్తి చేశారు. 

‘’ ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్ల సమయం ఉందనుకుంటున్నారు. మా అధినేత   చంద్రబాబు నాయుడు. వైసీపీ అధ్యక్షుడు జగన్.. రానున్న రోజులలో జనంలోకి వెళ్ళడానికి ముందే ఆ పార్టీని ఖాళీ చేయాలన్న అభిప్రాయంతో వైసీపీ చేరికలను కొందరు ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇది సరికాదు. పార్టీలో లుకలుకలు ఎక్కువవుతాయి. వైసీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపి,, జగన్ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిని చంద్రబాబు గమనించాలి..’’ అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే  తన అభిప్రాయాన్ని  అధినేత చంద్రబాబుకు వెల్లడించినట్లు చెపుతున్నారు.   

  ‘’తప్పులు చేసిన వైసీపీ వాళ్లపై కూడా చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్ధం కావడంలేదు. ఇది కార్యకర్తలలో అసహనాన్ని సూచిస్తోంది.. ‘’ అంటూ సదరు ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. 

 ‘’టీడీపీ కేడర్ లో అసంతృప్తి ఇపుడిపుడే మొదలవుతుంది. వైసీపీ వాళ్ళతో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు లాలూచి అవుతున్నారు. వైసీపీ నుంచి ఎన్నికల ముందు వచ్చి గెలుపొంది మంత్రులుగా పదవులు దక్కించుకున్న నలుగురి పేషీలో వైసీపీ మద్దతుదారులే పెత్తనం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడిన వారితో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు లాలూచీతో ఉన్నారు. కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రికి ఒక కార్పొరేషన్ చైర్మన్ మద్దతుగా నిలిచి అరెస్టు కాకుండా కాపాడారు. ఇలాంటివి అనేకం కూటమి నేతల వైఫల్య0, లాలూచీకి  సంకేతంగా పార్టీ కేడర్ భావిస్తోంది. కూటమి సర్కార్ పై పార్టీలలో కేడర్ మాత్రమే అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజలలో మాత్రం సంతృప్తి ఉంది.. అయితే చంద్రబాబు అభివృద్ధి, పాలన అంటూ రాజకీయాన్ని పూర్తిగా వదిలేస్తే.. 2014-2019 పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. గమనించి ముందే జాగ్రత్తపడటం మంచిది.. ‘’ అని  పలువురు టీడీపీ సీనియర్లు పార్టీకి సూచిస్తున్నారు.