మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై కూటమి నాయకులు కళ్లెర్ర జేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిన్న వైసీపీకి రాజీనామా చేసి మీడియాతో మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. యేడాది సమయం కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలలకే ధర్నాలు చేద్దామని అంటున్నారని దుయ్యబట్టారు. అది చూసి అంతా అవంతి మళ్లీ టీడీపీ లేదా జనసేనకు దగ్గయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి.
ఈ క్రమంలో అవంతి శ్రీనివాస్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి అవంతి శ్రీనివాస్ అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు నీ లాంటి ఊసరవెల్లి మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని. అందులో నువ్వు, జగన్ రెడ్డి కూడా భాగస్వాములే అంటూ ఆరోపణలకు దిగారు.
రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి గారి కుటుంబం, పవన్ కల్యాణ్ కే ద్రోహం చేసావంటూ ధ్వజమెత్తారు. గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో కూర్పెచోపెట్టిన చంద్రబాబునే అవమానించావ్. నీ సానుభూతి ఈ కుటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదు’ అని ట్వీట్ చేశారు.
అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీలో పనిచేశారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పనిచేసి మంచి పేరు సంపాదించారు. విద్యా సంస్థలు నెలకొల్పి ఆర్థికంగా బలపడిన వ్యక్తి కాబట్టే పార్టీలు ఆయనకు అంతటిి స్థానాలు కల్పించాయి కూడా. వైసీపీలోను కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు అధికారపార్టీవైపు చూడడం ఈ రోజుల్లో కామనే. అలాగే గతంలో తీవ్రవిమర్శలు చేసిన వాళ్లను పార్టీల్లోకి తీసుకోవడం కూడా జరుగుతున్నదే. ఈ నేపథ్యంలో అవంతి మళ్లీ టీడీపీలోకి వచ్చే అవకాశాలుంటాయని. ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే మిగతా నాయకులకు తమ పరపతికి ఏ మన్నా సమస్య వస్తుందేమోననే భయంతో ఉన్నారా? అనే అంతా అనుకుంటున్న విషయం. ఏ మవుతుందో వేచిచూడాల్సిందే..