ఇదేం భాష … గుంటూరు మేయర్ పై హైకోర్టు ఆగ్రహం

” అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా?. నగర ప్రధమ పౌరుడు మాట్లాడేది ఇలాగేనా?. సేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప.. అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడిన వారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. రాజకీయ పార్టీలు అవతలి వారి విధానాలు, పాలసీలను విమర్శించాలే కానీ , ఇలా వ్యక్తిగత దూషణాలేంటి ? . ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగర మేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు” అంటూ గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి నేతలపై కావటి మనోహర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ని క్వాష్ చేయాలంటూ హైకోర్టును మేయర్ మనోహర్ ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇవాళ (బుధవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం మనోహర్ వ్యాఖ్యలపై మండిపడింది.కేసు విచారణ సందర్భంగా గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్ నాయుడికి హైకోర్టు అక్షింతలు వేసింది.

నగర మొదట పౌరుడిగా బాధ్యతగా మెలగమని చెప్పాలంటూ మనోహర్ నాయుడు తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. కేసులో నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవి కాబట్టి పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. బీఎన్ఎస్ఎస్ యాక్ట్ 35(3) ప్రకారం నిందితుడికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత అరెస్టును నిరసిస్తూ కూటమి నేతలు గుంటూరు అరండల్‌పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే వైసీపీ నేత మనోహర్‌ నాయుడు అక్కడికి చేరుకుని హల్‌చల్‌ చేశారు. ఏకంగా పోలీసుల వద్ద లాఠీ లాక్కొని నిరసన తెలుపుతున్న వారిపైకి దూసుకెళ్లారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ను బూతులు తిడుతూ కార్యకర్తలపై దాడి చేసేందుకు యత్నించారు. దీనిపై తెదేపా, జనసేన నేతలు అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్‌పేట పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేయడంతో కావటి మనోహర్‌ నాయుడు, పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే .