ఆంధ్రుల రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ రానుందా ? ఏపీ యూత్ కలలు నెరవేర్చిడానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు . 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు .
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలోనే ఏపీ కేపిటల్ అమరావతిలో ‘డీప్ టెక్నాలజీ’ ఐకానిక్ భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు సంకల్పం చేసారు . దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు . నేటి యువత భవిష్యత్ డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైనా సీఎం చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రూ.25 లక్షలు సీడ్ ఫండింగ్: స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై సీఎం పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5ప్రాంతాల్లో జోనల్ హబ్‌లకు కేంద్రంగా అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పనిచేయాలని చెప్పారు.
ఐటీ క్యాంపస్‌కు వచ్చే సరికి 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం తుది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.