*
42వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చడంపై అభ్యంతరం చేయడం అర్థరహితమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లా కుమారస్వామి పేర్కొన్నారు.” రాజ్యాంగంలో సమానత్వ భావన అంతర్లీనంగా ఉంది. ప్రవేశికను సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంది” అని సుప్రీంకోర్టు చెప్పడం హర్షణీయమని ఆయన చెప్పారు. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని, లౌకిక స్వభావం భారత రాజ్యాంగంలో ఉందని, అన్ని మతాలకతీతంగా దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన అవకాశాలు స్వేచ్ఛ సామాజిక న్యాయం ప్రభుత్వం కల్పించే బాధ్యత అని ఇది లౌకికత్వాన్ని ప్రతిబింబిస్తుందని గతంలో ఎన్నో తీర్పుల్లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని ఆయన పేర్కొన్నారు.అయినప్పటికీ ఇటువంటి ప్రశ్నలు మళ్లీమళ్లీ తలెత్తడం శోచనీయం అని ఆయన అన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి :
పాలకులు లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించడం పరిపాటయిందని అలాకాకుండా మతసామరస్యాన్ని కాపాడడం కోసం లౌకికత్వాన్ని ప్రజల్లో పెంపొందించాలని, ఇది ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత అని ఆయన అన్నారు. ఈ తీర్పు మత చాందసులకు చెంప పెట్టని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం లో ప్రజలకు అవసరమైన సవరణలు చేసే అవకాశాలు పార్లమెంటుకు ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు అనేక సవరణలు ద్వారా చేస్తున్నారు కానీ లౌకిక స్ఫూర్తికి సోషలిస్ట్ స్ఫూర్తికి ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం కలిగించే విధంగా ఏ పాలకులు చేయరాదు. ప్రజల అభీష్టం ఇదే. మన రాజ్యాంగం చెబుతున్నది ఇదే అని ఆయన స్పష్టం చేశారు .