- శ్రీవారి భక్తులకు అలర్ట్
- రేపటి నుంచి సుప్రభాత సేవ రద్దు
- ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహణ
తిరుమల శ్రీవారి మాసోత్సవాలలో ధనుర్మాసం ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలో జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవలను రద్దు చేస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కాగా.. సుప్రభాత సేవలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. రేపటి నుంచి తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధనుర్మాస కైంకర్యాలు ఉండనున్నాయి. అలాగే ఈ సేవ స్థానంలో స్వామివారికి తిరుప్పావై నివేదిస్తారు. నెల రోజుల పాటు తిరుప్పావైతో శ్రీవారి మేల్కొలుపు ఉంటుంది. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నివేదించడంతో పాటు తిరుప్పావై పారాయణంలో భాగంగా రోజుకు ఒక పాశురం చొప్పున నివేదిస్తారు. తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలతో స్వామివారికి సహస్ర నామార్చన జరుగుతుంది. శ్రీ విల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై సేవలతో పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.