Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రధాన డోమ్ లీక్.. చుట్టుముట్టిన వరద

తాజ్ మహల్ చిక్కుల్లో పడింది .  ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal) కట్టడాన్ని వరద చుట్టుముట్టింది. తాజ్ మహల్ ప్రధాన డోమ్ కూడా లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 17వ శతాబ్దపు అద్భుత కట్టడం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ ప్రధాన డోమ్‌ వద్ద నీరు లీక్‌ అవుతోంది. భారీ వర్షం ధాటికి వరదంతా తాజ్‌మహల్‌ ఆవరణలోని తోటలో నిలిచిపోయింది. ఓ మోస్తరు   చెరువును తలపిస్తోంది. ప్రధాన డోమ్‌పై వాటర్ లీక్ అయినప్పటికీ డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోయినప్పటికీ తాజ్ మహల్‌‌ పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కట్టడాన్ని పరిశీలించడం కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని ఆగ్రా సర్కిల్‌ ఆర్కియాలజీ అధికారి రాజ్‌కుమార్ పటేల్ చెప్పారు.