అమరావతిపైనే చంద్రబాబు ఫోకస్..

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుకు తీసుకుపోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు చర్చ జరగనుంది. అలాగే విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, ప‌లు ప‌రిశ్రమ‌ల‌కు భూ కేటాయింపుల లాంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజుల క్రితమే జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లే అవుట్ లలో మౌలిక వసతులు కల్పన, ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి మొత్తం రూ. 24,276 కోట్ల పనులకు పాల‌న‌ప‌ర‌మైన ఆమోదం కోసం గురువారం మంత్రి వ‌ర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వనున్నారు.

55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేప‌ట్టనున్నారు. ఐదు టవర్ లకు రూ. 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్ లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్ధాయిలో ప్రారంభం చేయాల‌న్న సీఆర్డిఏ ప్రతిపాద‌న‌లకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలపనుంది.