Why not: ఆంధ్రాలో బీజేపీ అంతంత మాత్రమేనా ?

” 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన ,  టీడీపీలలోకి వలసలు పెరిగాయ్ .  సహజంగానే అధికార పార్టీలోకి వచ్చి చేరే వలస పక్షులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు .  అయితే కూటమిలో మరోపార్టీ బీజేపీలో మాత్రం చేరికలు లేవనే చెప్పాలి .  ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ,  ముగ్గురు  ఎంపీలను ప్రజలు గెలిపించినా … ఇక్కడ ఆ పార్టీ సొంతంగా బలపడలేకపోతోంది .  వాస్తవంగా ఏపీలో బీజేపీకి ముందు నుంచీ బలంలేదు .  అయితే బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి .  అయితే ఇప్పటి వరకు ఆ పార్టీకి ఇక్కడ బలమైన నాయకత్వ లేమి ఉంది .  ఈ కారణంగా ముందుకుపోలేక చతికిలబడే ఉంటుంది .

తాజాగా ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో బీజేపీ ,  జనసేన ,  టీడీపీ పార్టీల కూటమి అప్రతిహత విజయం సాధించింది .  ఓటమి పాలైన వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు ,  ఎమ్మెల్యేలు ,  ఎమ్మెల్సీలు ,  ఇతర నేతలు జనసేన ,  టీడీపీ పార్టీలలోకి జంప్ అవుతున్నారు .  బీజేపీలో చేరేందుకు కీలక నేతలు ఎవరూ పెద్దగా ఇష్టపడటంలేదు .  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో కూడా బీజేపీ పరిస్థితి మెరుగవుతుందో . . లేదో నన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ప్రధానంగా కనిపిస్తోంది .  ఈ కారణంగా ఆ పార్టీలో చేరికలు లేవని చెప్పాలి .

2029 ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు అక్కడ పార్టీ నేతలు బలమైన వ్యూహాలు రూపొందుచుకుంటున్నారు .  తెలంగాణలో ఎలాగూ బిఆర్ఎస్ బాగా బలహీనపడింది .  అధికార కాంగ్రెస్ పార్టీపై ఈ నాలుగున్నరేళ్లలో కొంత వ్యతిరేఖత ఎలాగూ వస్తుంది .  దీంతోపాటు . . తెలంగాణలో కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య ఉన్న వైరం ఎలాగూ ఆ పార్టీని 2029 ఎన్నికలలో గెలుపు అవకాశాలకు దూరంగా ఉంచుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి .  ఈ నేపథ్యంలో 2029 లో తెలంగాణ అసెంబ్లీలో కమలం పార్టీ పాగా వేయబోతోందన్న అంచనాలు రాజకీయ వర్గాలలో నెలకొన్నాయి .

ఆంధ్రాలో మెరుగుపడుతుందా ?  అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బలమైన నేతలు అతి కొద్దిమంది మాత్రమే బీజేపీలో ఉన్నారు .  ముందు నుంచీ బీజేపీలో ఉన్న నేతలలో కీలకమైన నేతలు ఇప్పటికీ వైసీపీతో లాలూచి కొనసాగిస్తున్నారు .  మధ్యలో వచ్చి చేరిన కొందరు నేతలు ఇంకా టీడీపీ అడుగుజాడలలోనే నడుస్తున్నారు .  ఈ కారణాలు ఏపీలో బీజేపీ భవిష్యత్తులో కూడా బలపడుతుందా ?  అనే అనుమానాలకు దారితీస్తోంది .  ఏపీ పై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్ సారించి . . 2029 నాటికి కాకపోయినా . . 2034 ఎన్నికలకైనా సొంతంగా పోటీ చేసే బలం చేకూర్చగలరా ?  అనుమానంగానే కనిపిస్తోంది .  వీటన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ,  వైసీపీ ,  జనసేన బలమైన ప్రాంతీయ పార్టీలు .  వీటిని కాదని బీజేపీలో చేరడానికి కీలక నేతలు ఆసక్తి చూపకపోవడం అన్నింటి కంటే బలమైన కారణంగా చెప్పవచ్చు .