రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన వివరాలు చెబుతున్నప్పటికీ, బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు (BJP Leaders create unnecessary confusion) రైతులను గందరగోళపరిచి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
‘రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు కాగా, వీరిలో భూములు ఉండి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 42 లక్షలు. బీఆర్స్ ప్రభుత్వంలోని 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే. అప్పట్లో కనీసం 20 లక్షల మందికి కూడా సరిగా మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు 42 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయి. రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకొని, కుటుంబ నిర్ధారణ అయిన ఖాతాల సంఖ్య 22,37,848. వీరికి ఇప్పటికే రూ.17,933.19 కోట్లను మొదటి పంట కాలంలోనే మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల, మిగతా 20 లక్షల మందికీ రుణమాఫీ చేస్తామన్నారు.