
ట్రంప్ చర్యకు చైనా స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్స్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం ముదిరిపాకాన పడేలా కనిపిస్తోంది. రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న చైనా కూడా అమెరికాపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. చైనాలో విక్రయించే అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వచ్చేలా చైనా ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చైనా తాజాగా చేసిన ప్రకటనతో వరల్డ్ వైడ్ వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగేలా కనిపిస్తోంది . ఈనెల 10 నుంచి నూతన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వినియోగించే ఏడు కీలక ఖనిజాల దిగుమతులపైనా చైనా వాణిజ్య శాఖ నియంత్రణలు విధించింది. అటు అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ 34 శాతం సుంకాలు విధించడంతో తాజాగా డ్రాగన్ అదే స్థాయిలో సుంకాలను వడ్డించింది.
చైనా-అమెరికా మిలిటరీ అధికారుల చర్చలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక, మొదటిసారి చైనా-అమెరికా మధ్య మిలిటరీ చర్చలు జరిగాయి. చైనాలోని షాంఘై నగరం వేదికగా ఈ ఇరుదేశాలు సైనిక భద్రతపై చర్చలు జరిపాయి. ఈ విషయాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ సహా, అమెరికా సైనిక ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ కూడా దీనిని ధ్రువీకరించాయి. ఇవి వర్కింగ్ లెవల్లో జరిగిన చర్చలుగా పెంటగాన్ పేర్కొంది. ఈ చర్చలకు అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్, కోస్ట్‌గార్డ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.