మోదీ సభకు  ఏర్పాట్లు ఇవిగో.. అతి భారీగా

మోదీ సభకు ఏర్పాట్లు ఇవిగో.. అతి భారీగా

మూడు వేదికలు – ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా

మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు

 ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది . మే 2వ తేదీన అమరావతికి వస్తున్నారు భారత్ ప్రధాని . రాజధాని అమరావతిలో 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.

లక్ష కోట్ల ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా . ..ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను పరిశీలించి ఖరారు చేసారు . దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

పటిష్టమైన వేదికలు . . ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

జనం రాక కోసం . .రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రోడ్డు, ఎన్‌10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు.

గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్‌9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్‌ప్లాజా సమీపంలోని మురుగన్‌ హోటల్‌ వద్ద ఎన్‌హెచ్‌-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్‌హెచ్‌ బైపాస్‌ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్‌9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్‌ఆర్‌ జంక్షన్, గోరంట్ల, లామ్‌-తాడికొండ క్రాస్‌రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్‌11, ఇ8, ఎన్‌10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్‌11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.

హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్‌ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్‌8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్‌9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు .

600/600 మార్కులు.. కాకినాడ విద్యార్థి రికార్డ్

600/600 మార్కులు.. కాకినాడ విద్యార్థి రికార్డ్

తెలుగు రాష్ట్రాల చరిత్రలో సరికొత్త రికార్డ్

పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 98 శాతం , 99 శాతం మార్కులు సాధిస్తేనే అత్యంత ఘనతగా చెప్పుకుంటాం . అలాంటిది 600 కి 600 మార్కులు సాధించి కాకినాడ విద్యార్థి అత్యంత అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది . నేహంజని అనే కాకినాడకు చెందిన స్టూడెంట్ కి ఈ ఘనత దక్కింది . ఈ బాలిక కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతోంది.

ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో ఎండ అనితకు 599 – ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌ పావని చంద్రికకు 598 మార్కులు

మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.

ఇంతటి ఘనత సాధించిన ఈ చిన్నారులను అభినందించాల్సిందే . అలా అని అందరి పిల్లలూ ఈ మాదిరిగా మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం మాత్రం సరికాదని పేరెంట్స్ గుర్తించుకోవాలి . మార్కులు అవసరమే కానీ , అవి ఒక్కటే కొలమానం కాదని మర్చిపోకూడదు .

బీజేపీలో విజయసాయి చేరిక ఖరారైనట్లేనా ?

బీజేపీలో విజయసాయి చేరిక ఖరారైనట్లేనా ?

విజయసాయి రెడ్డి బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట . ఇలాంటి నేతలను చేర్చుకుంటే వాళ్లపై ఉన్న అవినీతి , అరాచక మచ్చలు తమ పార్టీపై పడతాయన్న భావం కొందరు అసలైన బీజేపీ నేతలలో ఉంది . అయితే ఏపీలో మన పార్టీ ప్రభావం ఎంత ? దీనిగురించి ఎన్నికల నాటికీ జనం మర్చిపోతారులే . . అని వైసీపీకి మద్దతుగా నిలిచే ఒకరిద్దరు బీజేపీ నేతలే అధిష్టానానికి రికమండ్ చేస్తున్నారట .

ఆవిర్భావం నుంచీ సాయిరెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డికి నమ్మకమైన సహాయకుడిగా ఇన్నాళ్లూ వ్యవహరించారు. 2019 లో అధికారంలో ఉన్నపుడు వైసీపీలో విజయసాయి నెంబర్-2 గా వెలుగోదరు. జగన్కి- అతనికి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ… ఈ సంవత్సరం జనవరిలో, విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

కాకినాడ పోర్టు కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ మరియు వైఎస్‌ఆర్‌సిపి పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో ఉన్న విజయసాయి రెడ్డి క్రియాశీల రాజకీయాలను విడిచిపెట్టి, జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్‌ఆర్‌సిపికి దూరమై, తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినా . .. విజయసాయి రెడ్డి మాటలను జనం నమ్మలేదు .
ఒకే చాయిస్: విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక చాయిస్ బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అతనిపై ఈడీ , సీబీఐ కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా బీజేపీ యేతర పార్టీ గురించి ఊహించడానికే సాహసించలేని పరిస్థితి.

“ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాషాయ పార్టీ కూడా ఆయనను స్వాగతించడానికి చాలా ఆసక్తిగా ఉంది. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. విజయసాయి రెడ్డి చేరిక టిడిపితో ఉన్న ముఖ్యమైన పొత్తులో చికాకు కలిగించకూడదని బిజెపి కోరుకుంటోంది” అని విజయసాయి రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు.

“ఇక మిగిలి ఉన్నది నాయుడు నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) మాత్రమే.” అనేది సదరు నేత అభిప్రాయం .

టీమ్ శివంగి… ఇండియాలోనే ఫస్ట్ టైమ్

టీమ్ శివంగి… ఇండియాలోనే ఫస్ట్ టైమ్

మహిళల కోసం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ వ్యాప్తంగా ‘టీమ్ శివంగి’ ఏర్పాటుపై సర్కార్ యోచన

శభాష్ షర్మిల మేడం . .. ఎస్పీ జానకి షర్మిల అంకురార్పణకు అభినందనలు

తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఓ స్పెషల్ లేడీ కమాండో స్పెషల్ టీమ్ ఫామ్ చేసారు. ఆమధ్య నలుగురు తునికాకు కూలీలు దట్టమైన అడవిలో తప్పిపోతే తనే రంగంలోకి దిగి ఆమె కాపాడిన తీరు ఇంకా ఎవరూ మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఈ ఇనీషియేటివ్‌ ద్వారా అందరి అభినందనలు అందుకుంటున్నారు.

దేశంలోని త్రివిధ దళాలలో స్పెషల్ కమాండో ఫోర్సులు, ఆర్మీ కమాండోలు, నేవీలో మార్కోస్, అలాగే ఎన్‌ఎస్జీ, ఎస్‌పీజీ వంటి అత్యుత్తమ బలగాలు, గ్రేహౌండ్స్ వంటి రాష్ట్ర బలగాలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనతో ‘టీం శివంగి’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్‌కు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు.

మహిళలకు శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, రన్నింగ్ రేసులు, వర్టికల్ రోప్ క్లైంబింగ్, డిఫెన్స్ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాల వినియోగం, అన్ని రకాల ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాల ఫైరింగ్, నిర్వహణ, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేని నావిగేషన్, ఆకస్మిక వ్యూహాలు, శత్రు కదలికల అంచనా, అడవిలో సంకేతాలను అర్థం చేసుకోవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడులు, ఎదురు దాడులపై]పర్‌ఫెక్ట్ శిక్షణ అందించారు.

ఒక్కొక్కరిని ఒక్కో విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. కొంతమందికి యుద్ధ తంత్రాలపై, మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్, ఇంకొంతమందికి ఫైరింగ్, మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్‌గా రూపొందించారు.

విశాఖలో భూదోపిడీ ‘ద వైర్’ సంచలన కథనం

విశాఖలో భూదోపిడీ ‘ద వైర్’ సంచలన కథనం

59 ఎకరాలు – వెయ్యి కోట్ల దోపిడీ.. అంటూ ఇన్విస్టిగేటివ్ స్టోరీ.

ద వైర్ ప్రస్తావించిన అంశాలు ఇవే . ..

విశాఖపట్నం ఐటి హిల్‌ నం 3లో రూ 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్‌ ఏర్పాటు కోసం టీసిఎస్ ముందుకు వచ్చింది . 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది . ఐటి కంపెనీ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.

ఇక్కడికి సమీపంలో ఐటి పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీకి కేటాయించారు. దాంతోపాటు ఐపి కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి కేటాయించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ(ఎఐ) డేటా సెంటర్‌ ఏర్పాటుకు 5,728 కోట్ల పెట్టుబడితో ఉర్సా క్టస్టర్స్‌ కంపెనీ ముందుకొచ్చిందన్నది ప్రభుత్వం వాదన. ఆ సెంటర్‌ ఏర్పాటుకోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలూ, అనుబంధ షరతులూ, పెనాల్టీ క్లాజులు గురించిన పూర్తి నోటిఫికేషన్‌ ఇంకా జారీ కాలేదు. రావల్సిన వివరాలు ఎలా ఉన్నా రెండు నెలల ముందు పెట్టిన ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ, ఎవరితో మదింపు చేయించింది, ఈ మదింపు నివేదిక సారాంశం ఏంటి, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్ద్ధ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించటానికి, ఒప్పించటానికి ఉర్సా కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏమిటనే విషయాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. …

ద వైర్ రాసిన కధనం ప్రకారం . … మూడు నెలలు కూడా పూర్తికాని కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన 59 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి . దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తింది . ఖరీదైన భూమిని ఊరు – పేరు లేని కంపెనీకి కట్టబెట్టడంపై కూటమి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దీనిపై టీడీపీ , జనసేన కేడర్ లో సైతం అనుమానాలు రేకెత్తే రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి .