టారిఫ్ లు వద్దన్న టెస్లా అధినేత – పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల మంట.. తన సన్నిహితుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మంట పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య టారిఫ్ ల వ్యవహారం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది . ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ చేసింది . సుంకాలు విధించ వద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదనేది ఆ కధనం సారాంశం . వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుడు బల్ల గుద్ది మరీ చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ట్రంప్ పై మస్క్ గుర్రుగా ఉన్నట్లు సదరు కధనం స్పష్టం చేసింది .
నాలుగు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషించారు . తన ట్విటర్ (X ), ఇతర ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా అమెరికా ప్రజలలో ట్రంప్ వైపు తిప్పడంలో క్రియాశీల పాత్ర పోషించారు .
ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఇందుకు నిదదర్శనం. అంతేకాదు, యూర్‌పతో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. అయితే, సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్, వైట్‌హౌ్‌సకు మధ్య అగాధం పెరిగిందన్న వార్తలను ఇది మరింత బలపరుస్తోంది.
ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికాలో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో లక్షలాది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గేదిలేదంటూ హుంకరిస్తున్నారు .
రూ.11.61 లక్షల కోట్లు హాంఫట్ ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్ల (రూ.11.61 లక్షల కోట్లు) మేర తరిగిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు (రూ.25.80 లక్షల కోట్లు) పడిపోయింది. గత గురు, శుక్రవారాల్లోనే మస్క్ నెట్‌వర్త్ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం వాటిల్లబోతోందని టెస్లా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు .