రామ కధ తెలుసుకున్నాకా,, నైతికత , జీవన విలువలతో ఎంత మార్పు వచ్చింది ? గమనించాలి. ఆచరించాలి
రామాయణంలో నాయక , ప్రతి నాయక పాత్రలు మనకు ఎంతో సందేశాన్నిస్తున్నాయ్. మనం ఎలా ఉండాలో చెప్పడమే కాదు . . ఎలా ఉండకూడదో కూడా వివరిస్తోంది రామాయణం .
ఇందులో ఆయా పాత్రలు బోధించే మంచిని స్వీకరించి , చెడును తిరస్కరించగలుగుతున్నామో లేదో మనల్ని మనం విశ్లేషించుకోవడం ‘శ్రీరామ నవమి ‘ లాంటి పండగల ఉపయోగపడతాయి . రామాయణాన్ని మలుపుతిప్పిన మంథర వక్రబుద్ధి ..
ఉత్తమురాలిగా పేరొందిన కైకేయి సైతం మంధర వంటి దుష్ట బుద్ది కలిగిన మహిళ మాయమాటల్లోపడిపోయింది. విచక్షణ కోల్పోయి . . చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది . అందుకే ఎవరు ఏమి చెప్పినా , విని , తర్వాత పరిశీలన చేసుకోవాలి . సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి . అంతేకానీ పోసుకోలు కబుర్లు చెప్పేవారి మాటలు విని తొందరపడకూడదు .
కలియుగంలో ఎందరో మందరలు మన మద్యే ఉన్నారు. చాలా సందర్భాలలో మన మనస్సే మందర వలె వ్యవహరిస్తోంది . మనలోనే లేనిపోని ఊహాజనిత విష వలయాన్ని అల్లుతుంది . అపార్ధాలను సృష్టిస్తుంది . ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషాలను రగిలిస్తుంది . బుద్దిని కోల్పోయేలా చేస్తుంది . మన మద్యే ఉండే మందరల మాటలు వింటే ఏమవుతుందో ఆలోచించుకోండి .
కైకేయి మందర చెప్పిన మాటల్లోని నిజానిజాలను తెలుసుకోకుండా తొందరపడింది. వాస్తవం తెలుసుకోవడానికి దశరదుడ్ని కానీ , కౌసల్యనుగానీ, రాముడిని కానీ అడిగి ఉంటే అంత అనర్ధం జరిగి ఉండేది కాదు. రాముదంతటి మహనీయుడిని అడవులకు పంపడానికి కారణమై.. జనుల నిందను మోయవలసి వచ్చేది కాదు . తర్వాత కైకేయి ఈ విషయాన్నీ గ్రహించినా , , జరగాల్సిన నష్టం జరిగిపోయింది . దీనినిబట్టి మనం కూడా తోటివారి మాయమాటల వలలో పడకూడదన్న వాస్తవాన్ని గ్రహించాలి . ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి అయినవాళ్లను దూరం చేసుకోకూడదు . అపార్ధాలు కొనితెచ్చుకోకూడదు . చెప్పుకోలు మాటలు వింటే జరిగే అనర్ధాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి . రామాయణంలో ఇలాంటి నీతి సూత్రాలు ఎన్నో ఉన్నాయ్ . తెలుసుకోవడమే కాదు . . ఆచరణలో పెడితే మన జీవితాలకు ”శ్రీరామ రక్షా’ కవచం అండగా ఉంటుంది.