రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. ఇంకెన్నాళ్ళకు ?

Srinivas Vedulla

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ లో చోటుచేసుకున్న తప్పులు , అక్రమాలు సరిదిద్దడంలో కూటమి సర్కార్ సక్సెస్ కాలేదు

    ఏపీలో రెవిన్యూ ప్రక్షాళన చేస్తారా? రైతుల ఇబ్బందులు పట్టించుకోవడానికి కూటమి పెద్దలకు తీరికలేదా >

సర్వేయర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా.. భూ సమస్యలు పరిష్కరించాలని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.. 

   గత పాలకులపై విమర్శలు మాని.. పరిష్కారం దిశగా అడుగులు వేయాలి.. 

గతంలో జరిగిన తప్పిదాలను పదే పదే ఎత్తి చూపుతూ , గత పాలకులపై దుమ్మెత్తిపోస్తూ..   చంద్రబాబు సర్కార్ కాలం వెళ్లబుచ్చుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తప్పులను సరిదిద్దుతారన్న నమ్మకంతో గెలిపించిన ప్రజలకు పరిష్కార మార్గాలు చూపడంలో మీన మేషాలు లెక్కించడం ఇంకెన్నాళ్లు… అని ప్రశ్నిస్తున్న ప్రజలకు కూటమి సర్కార్ ఏమి సమాధానం చెపుతుంది. ఎలా సంతృప్తి పరుస్తుంది. సమస్య పరిస్కారంపై ద్రుష్టి సారించాల్సిన సమయం దాటిపోతున్నా,, గత పాలకులపై దుమ్మెత్తి పొసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో అర్ధంలేదు. 

 వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన ‘జగనన్న సమగ్ర భూ సర్వే’ లో వందలు, వేలు కాదు.. లక్షల సంఖ్యలో తప్పిదాలు జరిగాయి. సర్వే తప్పుల తడకతో  రైతులు మధ్య  భూ వివాదాలు ఏర్పడ్డాయి. వాటిని సరిదిద్దెందుకు కూటమి సర్కార్ ఇప్పటికి రెండు దఫాలుగా నిర్వహించిన ‘రెవిన్యూ సదస్సులలోనూ 25 శాతం కూడా పరిష్కారం కాలేదు. 

   2024 అక్టోబర్, నెలలో 13,325 పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలలో .. 53,342 ఫిర్యాదులు వచ్చాయి. డిసెంబర్ 2024లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో.. 62,732 ఫిర్యాదులు నమోదు చేశారు. అంటే రెండు విడతల సభలలో.. మొత్తం.. 1,26,074 ఫిర్యాదులు రైతుల నుంచి ప్రభుత్వానికి వచ్చాయి. 

వీటిలో..  సర్వే సమస్యలు, సరిహద్దు వివాదాలు,  రైతు భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలే ప్రధానంగా ఉన్నాయ్. 

   . 

 కొన్ని చోట్ల  అప్పటి అధికార వైసీపీ పెద్దల ఒత్తిడితో ప్రభుత్వ భూములకు రికార్డులు సృష్టించి భూములు కొట్టేసారు.  గ్రామాలలో భూములు ఉండి సదరు భూ యజమానులు పట్టణాలు, నగరాలలో ఉండే వారిలో కొందరి భూముల రికార్డులు కూడా మార్చేసి క్రయ, విక్రయాలు చేసిన సంఘటనలపై కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా  పెండింగ్ లో ఉన్నాయి. 

సీఎం చంద్రబాబు సీరియస్.. 

   రెవిన్యూ సదస్సులలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఫీడ్ బాక్ వస్తుందని ఇటీవల అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘త్వరలో పరిష్కారం అవుతాయి సార్..’ అని రెవిన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా సమాధానం చెప్పారు. ‘మనకు ఓపిక ఉంది.. ప్రజలకు, రైతులకు ఓపిక ఉండాలి కదా.. ఎన్ని రోజులు సహిస్తారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

సీఎం రెవిన్యూ అధికారులపై ఈ విధంగా సీరియస్ అవ్వడం.. ఈ ఆరు నెలల కాలంలో పదుల సంఖ్యలో జరిగింది. అయినా పరిస్థితులలో మార్పు కనిపించడంలేదంటే … ట్రీట్ మెంట్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై యంత్రాంగానికి పూర్తి క్లారిటీ వచ్చినట్లు కనిపించడంలేదని రెవిన్యూ శాఖలో కీలక అధికారి ఒకరు అనధికారికంగా చెప్పారు. 

 తప్పు చేసిన వారు ఎలా సరిచేస్తారు?

   జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘’జగనన్న సమగ్ర భూ సర్వే ‘ నిర్వహించారు. 45-50 శాతం భూములలో ఈ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఆ సమయంలో సర్వే అసమగ్రంగా, అడ్డదారులలో సాగినట్లు అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చేవి. అయినా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. 

    సర్వేలో సచివాలయ సర్వేయర్ల పాత్ర కీలకం. వీరిలో కొంతమందికి అవగాహనలేకపోవడ0, మరికొంతమంది సర్వేయర్లు మామూళ్లకు కక్కుర్తిపడి ఒక రైతు భూమి, మరో రైతు పేరుతో నమోదు చేయడం వంటి తప్పిదాలు చేశారు. కొన్ని చోట్ల రైతు జిరాయితీ భూములను సైతం.. నిషేధిత జాబితా (22 A ) లో చేర్చారు. ఆ జాబితా నుంచి తమ భూములను తొలగించాలంటే రెవిన్యూ, సర్వే అధికారులకు మామ్మూళ్లు ఇవ్వాల్సిందే. 

     వైసీపీ హయాంలో సర్వే నిర్వహించిన వారే.. ఇంకా ఆయా గ్రామాలలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తప్పు చేసిన ఉద్యోగులే.. ఆ తప్పులను సరిచేయాల్సిన దుస్థితి ఎదురయింది. ఇపుడు సరిచేస్తే.. గతంలో తాము చేసిన తప్పులు బయటపడతాయన్న భయంతో సదరు ఉద్యోగులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఉదాహరణలు ఇవిగో.. 

    కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన బి. శివరామ కృష్ణ అనే ఆదర్శ రైతుకి ఒక చోట 2 ఎకరాల భూమి ఉంది. జగనన్న సమగ్ర భూ సర్వేలో .. 20 సెంట్ల భూమి తక్కువ వచ్చినట్లు చూపారు. అయితే రికార్డ్ ప్రకారం 2 ఎకరాలు, కొలత ప్రకారం కూడా 2 ఎకరాలు ఉంది. ‘’ గతంలో తక్కువ చూపిన   సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బంది.. ఇపుడు సరిచేయడానికి ఇష్టపడటంలేదు.. ఎన్ని దరఖాస్తులు చేసినా పట్టించుకోవడంలేదు. నాకు దీనిపై అవగాహన ఉంది కాబట్టి పట్టువదలకుండా ప్రయత్నం చేస్తున్నాను. సాధిస్తాను. చిన్న రైతులు, అవగాహళనలేని వాళ్ళ సంగతి ఏమిటి? నాకు తెలిసి 50 సెంట్ల  భూమి ఉన్న ఓ చిన్న రైతు భూమిలో.. సర్వే తప్పుల వల్ల.. 23 సెంట్ల భూమి తక్కువ చూపుతున్నారు. ఇలాంటివి సరిచేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు? పాలన ఎందుకు?’’ అని శివ రామ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. 

‘’ భూ సమస్యలు, సర్వే తప్పులు సరి చేయడానికి.. ప్రభుత్వం ప్రత్యేకమైన ఆన్ లైన్ విధానం పెట్టాలి. 100 పదాలతో వారికి ఉన్న సమస్యపై యాప్ లో  నమోదు చేసుకునే ఛాన్స్ కల్పించాలి. లేదా వాట్సాప్ వంటి ఫ్లాట్ ఫామ్స్ ద్వారా.. ఫిర్యాదులు స్వీకరించి..  పరిష్కారం కోసం అధికారులకు డెడ్ లైన్ విధించాలి. టక్నాలజీ.. టెక్నాలజీ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడమే కాదు.. ఇలాంటి వాటికీ టెక్నాలజీ వాడాలి..’’ అని రైతు శివరాం ప్రసాద్.. 

 ‘అభి న్యూస్ “ ప్రతినిధితో  తో మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచన చేసారు. 

‘’ సమగ్ర భూ సర్వేలో 1.80 ఎకరాల భూమిలో 20 సెంట్ల భూమి తక్కువ చూపి.. 1.60 ఎకరాలు మాత్రమే ఉందని సర్వేయర్ రికార్డ్ చేశారు. దీనిపై అధరాలు ఇచ్చినా సరిదిద్దలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం, RTI ద్వారా ప్రశ్నించడం., ఇలా మూడు, నాలుగు నెలలు రెవిన్యూ, సర్వే అధికారులకు ఫిర్యాదులపై, ఫిర్యాదులు చేసిన తర్వాత నా సమస్య పరిష్కారం అయింది..వేలమంది రైతులు ఈ భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్కార్ దీనిపై ద్రుష్టి సారించి.. త్వరగా పరిష్కారం చూపాలి..’’ అని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన రైతు ఉండవల్లి నాగేంద్ర ‘’అభిన్యూస్ ‘ ప్రతినిధికి  తన సమస్య చెప్పారు.      

‘’ అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా,, గత ప్రభుత్వం చేసిన తప్పులను దెప్పుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప సరిదిద్దడంలో చంద్రబాబు సర్కార్  విఫలమవుతుంది.  సమస్యను పదే పదే ఫోకస్ చేస్తున్న కూటమి నేతలు.. పరిష్కారం దిశగా ప్రయత్ని0చి.. రైతుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి.. గత పాలకులు తప్పులు చేశారనే వారిని సాగనంపి మిమ్మల్ని గద్దె నెక్కించారు. మీరూ అలాగే చేస్తే.. వారి పరిస్థితే మీకూ ఎదురవుతుంది.. ‘’ అని నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రైతు నాయకుడు పి. ఎస్ కె కన్నారావు ‘ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు.  

రాష్ట్రంలోని మొత్తం 16 వేల గ్రామాలకు గాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి దాదాపు 7 వేల గ్రామాల్లో హడావుడిగా పూర్తి చేసింది. అయితే క్షేత్ర స్థాయి అధికారులు రైతులు, భూ యజమానులు ఫిర్యాదులతో తమ వద్దకు వెళ్లినా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాల రైతులు తమ భూమి సరిహద్దులు మార్చారని లేదా అసలు పత్రాల్లో పేర్కొన్న భూమి విస్తీర్ణం మార్చారని ఫిర్యాదులు చేస్తున్నారు. 

 భూమి రిజిస్టర్లలో తప్పుగా నమోదు చేయడం చాలా చోట్ల సమస్యలను సృష్టించింది. కొన్ని సందర్భాల్లో మరణించిన వ్యక్తుల పేర్లను కూడా చేర్చారు. 

  టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరిన్ని చిక్కులు తలెత్తకుండా భూ సర్వే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని భావించింది. అయినప్పటికీ, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రన్‌సైటన్ ప్రోగ్రామ్ (డిఐఎల్‌ఆర్‌ఎంపి)లో భాగంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని అదనపు జాగ్రత్తల తో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. “భూ యజమానుల హక్కుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే గత పాలనలో దాదాపు 21 లక్షల భూ రికార్డులు పంపిణీ చేయబడ్డాయి. ‘’దాదాపు 25-30% రికార్డులలో తప్పు నమోదులు జరిగాయని మేము అంచనా వేస్తున్నాము” అని సీనియర్ రెవిన్యూ  అధికారి ఒకరు ‘అభి న్యూస్ ‘ కు  తెలిపారు.

కొందరు సర్వేయర్లు ఎటువంటి సర్వే చేయకుండా నోటిస్,హాజరు,అంగీకార పత్రాలు పై సంతకాలు తీసుకొంటున్నారని .. ఇలా రైతు సమస్య పరిష్కారం కాకుండా అంగీకార పత్రంపై సంతకం చేస్తే.. ఆ సమస్య పరిష్కరించినట్లు నమోదవుతుందని.. ఇలా చేయవద్దని రైతు నాగేంద్ర .. తోటి రైతులకు సూచిస్తున్నారు. 

– కొందరు సర్వేయలు కొన్ని చోట్ల డాక్యుమెంట్స్,భూమి ఉన్న సరే , గవర్నమెంట్ రికార్డ్స్ లో వాటిని మాయం చేసి ఎటువంటి LPM NO ఇవ్వకుండా పక్క రైతులతో ఏదో విదముగా కలిసి వాటిని వారి డాక్యుమెంట్ లో చూపి0చారు. 

 – ఒక పూరా సర్వే లో ఒకరికి తక్కువ , ఎక్కువ ఉంటే సర్వేయర్లు ఎక్కువ ఉన్న వారి వద్ద నుండి సమ్మతి లెటర్ తెచ్చుకోండి అంటున్నారు. —- ఇది చాలా తప్పు. తక్కువ ఎక్కువ లు సరి చేయాలిసిన బాద్యత వారిదే.

  • ఇక సర్వేయర్లు , అధికార్లు వైపు నుంచి ఆలోచిస్తే..   వారికి ప్రభుత్వం నుండి  ఒత్తిడి ఉంది, తొందరగా పూర్తి చేయాలి అని, అందువల్ల ఆ ఒత్తిడితో హడావుడిగా పనిచేయాల్స వస్తుంది. 
  • రాష్ట్రమంతా ఒకేసారి సర్వే పూర్తి చేయాలంటే అయ్యే పనికాదు. అంచలంచెలుగా ఇది చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

You May Also Like…