తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక వాహన తయారీ పరిశ్రమ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీవీఎస్) సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవలే ముందుకొచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మరో భారీ పరిశ్రమనూ తెలంగాణాలో ఏర్పాటు చేసేందుకు ఒప్పించడం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవగా చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారీ వాహనాల తయారీ సంస్థ ‘బిలిటీ ఎలక్ట్రిక్స్’ త్రిచక్ర వాహనాల తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇప్పటికే శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమ రాకతో మరిన్ని ఉప పరిశ్రమలకు అవకాశం వస్తుంది.
అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారీ వాహనాలను తయారు చేస్తోంది. ఈ కంపెనీకి ఇప్పటికే పలు దేశాల్లో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. అమెజాన్, ఐకియా, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు తమ వాహనాలను విక్రయిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న బిలిటీ సంస్థ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌గా రికార్డులకు ఎక్కనుంది.
ఇటీవలి అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అనుకూలతలను ఆయన కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కేటీఆర్ ప్రజెంటేషన్‌పై లోతుగా పరిశీలించిన బిలిటీ సంస్థ తెలంగాణలో తన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్లాంట్ ఏర్పాటుపై త్వరలోనే తెలంగాణ సర్కారు తో బిలిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.