‘‘ నేను బతకడం కోసం తింటాను. నాకు డబ్బు లేదు.. అక్కర్లేదు., కోరికలు కూడా లేవు. పాలు తాగను. తినే తిండిలో ఉప్పు, నూనెలు ఉండవు. పగలు నిద్రపోవడమన్నది నా జీవితంలో లేదు. వీటితో పాటు రెగ్యులర్ గా యోగ చేస్తుంటా.. అందుకే 126 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగానే ఉండగలుగుతున్నాను’’ అని పద్మశ్రీ స్వామి శివానంద అన్నారు. దేశంలో అత్యధిక వయసున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న స్పోర్ట్స్ ఎక్స్పో ముగింపు వేడుకలకు విచ్చేశారు. ‘యోగానమామి’ పేరిట ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో నగరవాసులకు పలు ఆసనాలు నేర్పారు. ”తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి యోగా నేర్చుకున్నాను. అప్పటి నుంచి నా దినచర్యలో ఇదో భాగమైంది.. సర్వాంగాసన, మత్స్యాసనాలు పునరుత్తేజం కలిగిస్తాయి.. నిత్య నూతనంగా ఉండాలనుకునే వారు.. వాటిని అభ్యసించాలి..” అని స్వామి ఉద్బోధించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఆరోగ్య రహస్యాలు, జీవిత విశేషాలను పంచుకున్నారు. గురువు ఓంకారానంద గోస్వామి ఆశీర్వాదబలం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని స్వామి శివానంద వెల్లడించారు. 40 ఏళ్లుగా ఆరు ఖండాలలో పలు దేశాలను సందర్శించినప్పటికీ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారన్నారు. ఆగస్టు 8, 1896న జన్మించానని.. ఇప్పుడు తనకు 126 ఏళ్లని చెప్పారు. సాధారణ జీవితం గడుపుతానని.. తనకు డబ్బు మీద వ్యామోహం లేదని, విరాళాలు స్వీకరించనని చెప్పారు. ‘‘పురాతన జీవన విధానాన్ని అనుసరిస్తా. అరుదుగా మాత్రమే ఉదయం అల్పాహారం తీసుకుంటా. అది కూడా ఉడికించిన బంగాళదుంప మాత్రమే. మధ్యాహ్న, రాత్రి భోజనం చాలా స్వల్పంగా తింటా. రెండు చపాతీలు, ఉడికించిన బంగాళదుంప, కొద్దిగా అన్నం, అత్యంత అరుదుగా గంజి తాగుతాను’’ అని చెప్పారు. పాలు, అరటి పళ్లు లాంటివి ఎందుకు తినరన్న ప్రశ్నకు.. ‘‘చిన్నతనంలో ఇంటింటికీ వెళ్లి అడుక్కునేవాడిని. దేశంలో పేదలు ఇప్పటికీ పాలు, అరటి పళ్లు తినే స్థితిలో లేరు. నేను మాత్రం వాటిని ఎలా తీసుకోగలను?’’ అని ఆయన అన్నారు.
తెల్లవారుజామున 3 గంటలకే..
తన దినచర్య తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుందని శివానంద చెప్పారు. స్నానం చేసి ఓ గంట నడక తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం తర్వాత.. రెండు గంట లు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. రాత్రి 9గంటలకల్లా పడుకుంటానన్నారు. కుటుంబ సభ్యులెవరూ లేరని, బ్రహ్మచారినని తెలిపారు. వారాణసీ తన ఆవాసమన్నారు. ఈ ప్రపంచమంతా తన కుటుంబమేనని.. జీవితాన్ని కుష్టు వ్యాధిగ్రస్థుల సేవకు అంకితం చేశానని చెప్పారు.