ULI: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వాళ్లు ఉండరనే చెప్పుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా ఆన్ లైన్ పేమెంట్ (Online Payment) జరిపే ప్రతి ఒక్కరికీ యూపీఐ గురించి అవగాహన ఉంటుంది. నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపుల(Digital payments)కు యూపీఐ శ్రీకారం చుట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
తాజాగా యూపీఐ (UPI) తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (Unified Lending Interface) ను అందుబాటులోకి తీసుకురానుంది. సులభంగా రుణాలను పొందేందుకు యూఎల్ఐ(ULI) ఉపయోగపడనుండగా.. దేశంలో రుణాల మంజూరు వ్యవస్థను వేగవంతం చేయడమే దీని లక్ష్యం. అంతేకాకుండా ఇది లెండింగ్ సెగ్మెంట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయగలదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రుణాలను పొందడంలో ఇబ్బందులను తొలగించే విధంగా యూఎల్ఐని రూపొందించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shakthikantha Das) తెలిపారు. ప్రస్తుతం ఫైలట్ ప్రాజెక్టుగా యూఎల్ఐని ప్రారంభించామన్న ఆయన దేశవ్యాప్తంగా యూఎల్ఐని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.