Monkeypox: కరోనా తరహాలో మరో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికాలో మొదలైన మంకీపాక్స్ (Monkeypox)ఇతర దేశాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర స్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan) లో కూడా మంకీపాక్స్ వ్యాపిస్తోందని తెలుస్తోంది. దీంతో భారత్ లోని కేంద్ర ప్రభుత్వం (Central Government) అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర నిఘా పెంచాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలు (Monkeypox Symptoms) ఉన్న వారు ఎవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని సూచించింది. అదేవిధంగా మంకీపాక్స్ వైరస్ బారిన పడిన వారిని ఐసోలేషన్ లో ఉంచేందుకు మరియు చికిత్స చేసేందుకు వీలుగా ఢిల్లీలో పలు ఆస్పత్రులను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు (State Governments) కూడా మంకీపాక్స్ నోడల్ కేంద్రాలు(Nodal centers)గా కొన్ని ఆస్పత్రులను గుర్తించాలని తెలిపింది. అయితే భారత్ లో ఇప్పటివరకూ మంకీపాక్స్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదు.