ఆఫ్రికా (Africa) లో మొదలైన మహమ్మారి మంకీపాక్స్(Monkeypox) తీవ్రరూపం దాల్చుతోంది. ఇక్కడ సుమారు 12 దేశాలలో విస్తరించిన మంకీపాక్స్ వైరస్ తాజాగా ఆసియా(Asia) లోకి ప్రవేశించింది.
ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ (New Varient) మొదటి కేసును థాయిలాండ్ ప్రభుత్వం (Thailand Government) ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్ట్ 14న ఆఫ్రికా నుంచి థాయిలాండ్ కు వచ్చాడని తెలుస్తోంది. మంకీపాక్స్ లక్షణాలు కన్పించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్, క్లాడ్ 1బి అనే స్ట్రెయిన్ (Clade 1b strain) సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఇప్పటికే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మంకీపాక్స్ కొత్త వేరియంట్ అంటువ్యాధని సమాచారం. 2022లో కంటే చాలా ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్ఓ (WHO)తెలిపింది.
మంకీపాక్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత్ (India) అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ (Pakistan, Bangladesh) సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని విమానాశ్రయాలతో పాటు పోర్టుల వద్ద అధికారులను కేంద్ర ప్రభుత్వం (Central Government) అప్రమత్తం చేసింది.