హైదరాబాద్: అమీన్ పూర్ (Ameenpur) కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా (hydra) కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ ఎమ్మార్వోపై (Ameenpur MRO) హైకోర్టు (TS High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ (Ranganathan) వివరణ ఇచ్చారు. అమీన్ పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ ఇవాళ (సెప్టెంబర్ 30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్గా (virtual) హాజరయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. చార్మినార్ (Charminar) ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్ (kaveri hills) పై సమాధానం ఎందుకు చేస్తున్నారని సున్నితంగా మందలించింది.
హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్ పూర్ ఎమ్మార్వో కౌంటర్ MRO counter) దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను (Case postponed) అక్టోబర్ 8కి వాయిదా వేసింది.