Hyderabad: ఆ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే.  నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు ఈ మొత్తం అందించనున్నారు. ఇల్లు ఖాళీ చేసిన వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు వారికి ఉపయోగంగా  ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తమకు సమీపంలోనే రెండు మూడు కిలో మీటర్ల దూరంలోనే ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్‌నగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లిగుడెసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు.

ఇప్పటి వరకూ 40 శాతం మంది మాత్రమే ఇళ్లు ఖాళీ చేశారు.  ఇళ్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్న 60 శాతం మంది కుటుంబాల ఇబ్బందులను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా  రెవెన్యూ అధికారులు ఈరోజు, రేపు ప్రతి కుటుంబాన్ని కలిసి  ఇబ్బందులను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నారు.