BRS: రైతు భరోసాకు ఎగనామం పెట్టారు.. కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు

ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించింది బీఆర్ఎస్‌ పార్టీ. అన్నదాతలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అన్ని మండలకేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్, కరీంనగర్ జిల్లాలో హరీశ్‌రావు నిరసనకు దిగారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీశ్ష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాట్లాడుతూ రైతుబంధు కూడా ఇవ్వలేమని రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు భరోసాకు ఎగనామం పెట్టిందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నయవంచక పాలన కొనసాగుతోందంటూ హరీష్‌ రావు విమర్శించారు. గ్యారెంటీల పేరిట గారడీలు చేశారన్నారు. రైతు బంధు ఇచ్చేదాక కాంగ్రెస్‌ నేతలను ఉరికించాలన్నారు. సీఎం ముమ్మాటికీ రైతు వ్యతిరేకి అని హరీశ్  విమర్శించారు.