టెస్టు జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని చూస్తున్న పలువురు ఆటగాళ్లు స్థానిక టోర్నమెంట్లలో ఇరగదీస్తున్నారు. ఇటీవలే ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా…తాజాగా కరుణ్ నాయర్ కుమ్మేశాడు. మహారాజా టీ 20 టోర్నమెంట్లో కేవలం 48 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. గతంలో ఎన్నడూ లేనంతగా సత్తా చాటాడు.
భారత క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్న వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ మాత్రమే ఉన్నాడు. అటువంటి కరుణ్ నాయర్ ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నాడు. 2016లో ఇంగ్లండ్ జట్టుతో చెన్నైలో జరిగిన మ్యాచ్లో 303 పరుగులు చేసిన కరుణ్ నాయర్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. విచిత్రంగా ఆ తర్వాత జరిగిన టెస్టు మ్యాచ్లో స్థానం కోల్పోయాడు. త్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కేవలం మూడంటే మూడు టెస్టుల్లో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. అప్పటి నుంచి పలుసార్లు జాతీయ జట్టులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 2017 మార్చి నెలలో చివరి టెస్టు ఆడిన కరుణ్ నాయర్ … ప్రస్తుతం ఎంతో కసితో ఆడుతున్నాడు. సెలక్టర్లను ఆకట్టుకునే విధంగా ఆటతీరు కనబరుస్తున్నాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా కరుణ్ నాయర్ ను చిన్నచూపు చూస్తున్నాయి. 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన కరుణ్ నాయర్ ఆ తర్వాత ఏ జట్టు తరపున కూడా ఆడలేదు. అదే విధంగా కర్ణాటక జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కరుణ్ నాయర్ జాతీయ జట్టులోకి తిరిగి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిరాశకు గురికాకుండా పోరాటం కొనసాగిస్తున్నాడు. విదర్భ జట్టు తరపున ఆడడం ప్రారంభించాడు. గత రంజీ సీజన్లో విదర్భ జట్టు తరపున ఆడిన కరుణ్ నాయర్ ఏకంగా 690 పరుగులు చేశాడు. విదర్భ జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లగలిగాడు.
తాజాగా జరుగుతున్న మహారాజా టీ 20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరపున ఆడుతున్న కరుణ్ నాయర్ 12 ఇన్నింగ్స్ లో ఏకంగా 532 పరుగులు చేశాడు. దులీప్ ట్రోపీలో తనను సెలెక్ట్ చేయకపోవడంపై కూడా కరుణ్ నాయర్ నిరాశ చెందలేదు. టెస్టు జట్టులోకి తిరిగి వచ్చేందుకు ఇంకా తనకు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నాడు. భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు. రాబోయే అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటానని నమ్మకం వ్యక్తం చేశాడు. మరి మన సెలెక్టర్లు కురుణపై కరుణ చూపిస్తారా లేదా అనేది కొన్ని రోజులు ఆగితేగానీ తెలియదు.