“నా గ్రాఫ్ 60 లో ఉంటే , ఎమ్మెల్యేలు 40 లోనే ఉండిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఇలాంటి వారిని మార్చాల్సి ఉంటుంది. “ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపైనా, ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైనా కొన్ని గణాంకాలు చెప్పారు. ఇదే సమయంలో 175 సీట్లు గెలుచుకోవాలి.. అంటూ కూడా దిశా నిర్దేశం చేసుకున్నారు. ‘అధికారంలోకి రావాలనుకోవడం వరకు ఓకె.. మొత్తం సీట్లన్నీ మనమే గెలవాలి.. అనే మాటలు సొంత పార్టీ నేతలను సైతం అయోమయానికి, అనుమానాలకు గురిచేశాయి. ఇదే సమయంలో ‘ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని చెప్పడంపైనా ఆ పార్టీలో చర్చ మొదలయింది..’. జగన్ తీరును పరిశీలిస్తే.., ఆత్మ విశ్వాసం లోపించినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రపై చేసిన కామెంట్స్ కూడా బలమైన ప్రభావం చూపాయని చెప్పాలి.
పేదల్లో అంత వ్యతిరేఖత ఉందా?
“మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో జనం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. బయట అప్పులు కూడా దొరకవు. జగన్ మరోసారి సీఎం కాకూడదు..” ఇలా టీడీపీ వాళ్లే కాదు ఏపీలో చాలా మందే కోరుకుంటున్నారు. నిజమే… ఇటువంటి వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువగానే వినిపిస్తున్నాయి. జనంలోనూ జగన్ పాలనపై తీవ్రమైన వ్యతిరేఖత వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ముందు నుంచీ నమ్ముకుంటున్న ‘పేద వర్గం’ ప్రజలలో మాత్రం ఈ వ్యతిరేఖత ఏ మేరకు ఉందనేది స్పష్టత లేదు. ఆంధ్రాలో రోడ్లు దుస్థితి,, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్య వంటివి ప్రజా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయ్. వీటిపై నిరసన తెలపడానికి సామాన్యుడు రోడ్డు ఎక్కకపోయిన ఈ ప్రభావం ఎంతోకొంత పాలక పక్షానికి నష్టం చేకూర్చేదే ఉంటుంది. అయితే వ్యక్తిగత ప్రయోజనమే ప్రధానంగా చూసే ఆంధ్రా ఓటర్లలో సామాజిక సమస్యలు, శాంతి భద్రతల అంశాలు పెద్దగా ప్రభావం చూపేవి కాదన్న విషయాన్నీ జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి, సామాజిక, శాంతి భద్రతల అంశాలకు పెద్దగా పట్టించుకోవడం లేదు.
జగన్ ట్రాప్ లో..
“అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక, అధికార దుర్వినియోగంతో కూడిన కక్షసాధింపుల జగన్ విధానాలతో వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది…” అని టీడీపీ ముఖ్య నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ ని తట్టుకోవడం టీడీపీకి, చంద్రబాబుకి అంత ఈజీ కాదు. జగన్ బ్యాచ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ బ్యాచ్ కి సమాధానం ఇవ్వడంలోనే తెలుగుదేశం ముఖ్యులు బిజీ అయిపోయారు. జగన్ ట్రాప్ లో చిక్కుకున్నామని తెలిసినా ఈ విషయంలో ఏమీ చేయలేని స్థితి.
కాస్త ఆలోచిస్తున్నారు..
జగన్ ..జనానికి ఉచితాల పేరుతొ డబ్బు పంచుతున్నారు. 70-80 శాతం మందికి నేరుగా ఏదో ఒక పధకం అందుతోంది. అయితే ఈ పథకాలే తనను గట్టెక్కిస్తాయని జగన్ భావిస్తే పొరబడ్డట్టే. ఏపీలో విద్యుత్ కోతల ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ కి గడ్డు పరిస్థితే. సంక్షేమ పధకాల పేరుతొ రైతులకు ఇచ్చే డ్రిప్ సబ్సిడీని నిలిపివేశారు. రాయలసీమ రైతాంగంలో ఇది ప్రభావం చూపవచ్చు. ఇవన్నీ జగన్ కి తెలియక కాదు.. అయితే ఇవేవీ ఇవ్వకపోయినా.. పేదలకు ఇచ్చే పధకాలు, డబ్బు కంటిన్యూ చేస్తే అవే తనను గట్టెక్కిస్తాయని బలంగా నమ్ముతున్నారు. అయితే జగన్ పాలనపై జనంలో అనుకూలత, వ్యతిరేఖత మాటెలా ఉన్నా.. కాస్త ఆలోచిస్తున్నారు.