”జగన్ అరాచక పాలనతో బెంబేలెత్తుతున్న జనంలో మార్పు తప్పకుండా వస్తుంది. కాకపొతే ఆ వ్యతిరేక ఓటు విడిపోతే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఇబ్బంది పడాలేమో …” ఇదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనసులో భావనలా కనిపిస్తోంది. ఈ కారణంగానే చంద్రబాబు .. 2024 ఎన్నికల్లో జనసేన తో కలసి వెళ్లాలని తహతహలాడుతున్నారు. అయితే ఇటీవల వరకు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం.. ”వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను..” అంటూ పదేపదే చెప్పుకొచ్చేవారు. ఇటీవల విశాఖలో ప్రధాని మోడీని కలసిన తర్వాత పవన్ ఆ స్టేట్ మెంట్ ఊసెత్తడంలేదు. అతని ఇబ్బందులు అతనికి ఉన్నాయిలెండి.. ఈడీ కేసులనో, బోడీ కేసులనో ఏవోటి తెరపైకి వస్తే అతనికి కూడా ఇబ్బందే కదా..పాపం..
—- అంటే.. తెలుగుదేశంతో జనసేన వెళ్లకుండా మోడీ కట్టడి చేసినట్లేనన్న భావన ఏపీ రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. దీంతో జనంలో సైతం ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న కొంత క్లారిటీ వచ్చింది. ఇంత జరుగుతున్నా … చంద్రబాబు మాత్రం జనసేన తో పొత్తు కోసం ఇంకా వెంపర్లాడుతూనే ఉన్నారు.
బీసీలపై ఫోకస్ పెట్టాలి: ఆవిర్భావం నుంచీ టీడీపీకి బలం బీసీ సామాజిక వర్గాలు.” 2019 ఎన్నికలలో చంద్రబాబు ఆ విషయాన్ని విస్మరించి.. కాపు సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకున్నారు. దీంతో బీసీలు వైసీపీ వైపు వెళ్లిపోయారు. ఇదే సమయంలో మెజార్టీ కాపులు జనసేనకు మద్దతుగా నిలిచారు. ఈ ప్రభావం వల్ల టీడీపీ ఓట్లు గణనీయంగా చీలిపోయాయి..” ఇలాంటి నష్టాలను భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు ఇపుడు జనసేనతో పొత్తు పెట్టుకోకుండా ఉంటె బీసీలు మళ్ళీ టీడీపీకి కన్సలడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది..
– ఇటీవల పలు సర్వేలు సైతం ఏపీలో జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉన్నట్లు స్పష్టం చేస్తున్నా… చంద్రబాబు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? అనేది టీడీపీ వర్గాలలో జరుగుతున్న చర్చ.
పవన్ బలం పెరిగిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్థత పై జనంలో పెద్దగా నమ్మకం పెరిగిందేమీ లేదు. సీఎం జగన్ తాయిలాలతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసారు. పరిశ్రమలను రప్పించలేకపోయారు. ఉన్న వాటిని తరిమేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజులలో ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలసలు పోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఈ క్లిష్ట పరిస్థితులలో పవన్ కళ్యాణ్ వంటి వారికి అధికారం కట్టబెడితే గాడిన పెట్టగల సమర్థత ఉందని ఏపీ ప్రజలు భావించడంలేదనే చెప్పాలి. అలాంటపుడు.. చంద్రబాబు పొత్తు కోసం భయపడాల్సిన అవసరం ఏముంది? అక్రమ ఇసుక, లిక్కర్, మైన్స్ , భూ కబ్జాలతో భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్న అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ ఇవ్వనంత డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెడతారన్న భయం చంద్రబాబు అండ్ కో కు ఉన్నందు వల్లే… ఎన్నికలను విడిగా ఎదుర్కోలేమన్న భయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
బాబు ధైర్యంగా దూసుకెళ్ళాలి.. జగన్ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆర్ధిక, సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దుర్భర పరిస్థితిని చక్కబెట్టగల సమర్థ నేత చంద్రబాబు ఒక్కరే కనిపిస్తున్నారు… అని మెజార్టీ జనం భావించే పరిస్థితి వస్తోంది. అయితే చంద్రబాబు ఒకటే అపీల్ చేయాలి. ”మీ పిల్లల భవిష్యత్తు కోసం నా అవసరం ఉందంటే.. బలపరచండి. మీకు వచ్చే తాత్కాలిక తాయిలాలే చాలనుకుంటే మీ ఇష్టం..” అంటూ నిర్భయంగా ప్రకటించగలిగే ధైర్యం కూడగట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు టాలెంట్ గతంలో చూసిన జనం… వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయకుండా.. ఇంకా తాత్కాలిక తాయిలాలు, స్థానిక రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారా? చంద్రబాబు బీజేపీతో, జనసేన్తో పొత్తు కోసం అంత తాపత్రయపడక్కర్లేదు. బీజేపీకి ఏపీలో ఒక శాతం ఓట్లు కూడాలేవు. జనసేనకు కూడా గోదావరి జిల్లాలలో మాత్రం 7-9 శాతం ఓట్లు ఉండవచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలో గెలుపు, ఓటమిలను ప్రభావితం చేసేంత పర్సెంటేజ్ లేదనే చెప్పాలి. అలాంటపుడు చంద్రబాబుకి జనసేనతో జట్టు కట్టాలన్న తహతహ ఎందుకో మరి. కాదు.. తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాకపోతే.. చంద్రబాబుకి ఊడేదేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని మేధావులు, విశ్లేషకులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అధోగతి పాలవకుండా కాపాడుకోవాలంటే ఆ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు.. సమాజం బాగుండాలి.. అందులో నేనుండాలి.. అని భావించే అందరిదీ..