వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాల్సి ఉందని సీబీఐ కోర్టులో అఫిడవిట్ వేసినా.. అరెస్టుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. సాక్షాత్తూ అవినాష్ ని అరెస్ట్ చేస్తామని కోర్టుకు చెప్పిన సీబీఐ అధికారుల దోబుచులాటలతో అత్యున్నత దర్యాప్తు సంస్థపై నీలినీడలు అలముకుంటున్నాయ్. దేశంలో న్యాయవ్యవస్థలో పాటు సీబీఐ లాంటి అతి కొద్ది సంస్థలకే విశ్వసనీయత ఉంది ఇప్పటి వరకు. ఇటీవల రాజకీయంగా తమ ప్రత్యర్థులను, తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారిపైనే కేంద్రం సీబీఐని ఉసిగొలుపుతుందనన్నది ఇటీవల ప్రచారం జరుగుతోంది.
అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐకి కష్టమేమీ కాదు. అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని చడీచప్పుడు లేకుండా అరెస్ట్ చేయలేదా? అవినాశ్ విషయంలో జరుగుతున్న తంతు చూస్తూంటే ఈ దేశంలో ఏ వ్యవస్థను నమ్మాలో తెలియని పరిస్థితి. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రెండు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఇలాంటి ఆదేశాలను ఆమోదించలేమని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో ఇవేమి ఉత్తర్వులంటూ ఆగ్రహం వ్యక్తంచేయడంతో తలపట్టుకోవాల్సిన పరిస్థితి. దర్యాప్తులో సందేహాలకు తావు లేకుండా వ్యవహరించాల్సిన సీబీఐ ఇప్పుడు అవినాశ్‌రెడ్డి విషయంలో ఒకరకంగా కామెడీ పాత్ర పోషిస్తోంది. ఈ నెల 19న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన అవినాశ్‌రెడ్డి చివరి నిమిషంలో తన తల్లికి బాగోలేదని విచారణకు డుమ్మా కొట్టి పులివెందులకు పయనం కాగా, సీబీఐ అధికారులు ఆయనను అనుసరిస్తూ వెళ్లారు. పులివెందులకు చేరుకోకముందే గంగిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్‌రెడ్డి తల్లిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించినట్టు ప్రచారం చేశారు. ఆమెను పులివెందులకు చెందిన ఓ వ్యక్తి కర్నూలులో నిర్వహిస్తున్న ఆస్పత్రిలో చేర్చారు. అవినాశ్ తల్లి పరిస్థితి నిజంగా సీరియస్ అయితే హైదరాబాద్‌కు తరలించకుండా కర్నూలు ఆస్పత్రిలో చేర్పించడమేమిటి? తల్లితోపాటు అవినాశ్‌రెడ్డి కూడా అదే ఆస్పత్రిలో ఉండిపోయారు. అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం కూడా బాగోలేదని మధ్యలో ప్రచారం ఒకటి! హైదరాబాద్ నుంచి అవినాశ్‌రెడ్డిని అనుసరించిన సీబీఐ అధికారులు కర్నూలు ఆస్పత్రిలోకి వెళ్లి పరిస్థితిని వాకబు చేయకుండా చేతులూపుకొంటూ హైదరాబాద్ తిరిగి వచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలనుకుంటే శని, ఆదివారాలు అడ్డు కాదు కదా.. తాను అరెస్ట్ కాకూడదని అవినాశ్‌రెడ్డి సంకల్పం తీసుకున్నట్టుగా ఉంది. అదే సమయంలో సీబీఐ కాళ్లు చేతులను అదృశ్య శక్తి కట్టిపడేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న వారికి ”ఇదే సీబీఐ సామాన్యలు విషయంలో అయితే ఇలాగే వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు రాకమానవు..