రాష్ట్రపతి రేసు జోరుగా అందుకుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెల 18న జరిగే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి బుధవారం నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి గురువారం పరిశీలిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. మరో 50 మంది బలపరచడం తప్పనిసరి.
సామాన్య అభ్యర్థులకు అది సాధ్యం కాదు. చివరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కేరళ నుంచి తన ప్రచారాన్ని నిన్న మొదలు పెట్టారు. దానికి కారణం అక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేకపోవడమే. అక్కడి నుంచి తనకు ఎక్కువ ఓట్లు దక్కుతాయని ఆయన ఆశిస్తున్నారు. తిరువనంతపురంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి మద్దతు కోరారు.
తమిళనాడుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహమ్మద్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూరు సుందరపురానికి చెందిన నూర్.. స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ, పార్లమెంటరీ, స్థానిక సంస్థలు ఇలా వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పటి వరకు 38 ఎన్నికల్లో నూర్ బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రజలు అవకాశం ఇస్తారని తనకు నమ్మకం ఉందని.. అందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు నూర్ మహమ్మద్.