చివరకు అనుకున్నదే అయింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వస్తున్న వార్తలకు ఆయనే స్వయంగా చెక్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తనకు అంగీకారం కాదని ఆ పార్టీ అధిష్ఠానానికి తెలియజేసినట్టు మంగళవారం ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా ఇదే అంశాన్ని ధ్రువీకరించడంతో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయని చెప్పాలి.
ఇందుకు గట్టి కారణాలే ఉన్నాయి. టీఆర్ఎస్, వైసీపీ, టీఎంసీ తదితర ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధం కావాలని పీకే పార్టీ అధిష్ఠానానికి సలహా ఇచ్చినట్టు వచ్చిన వార్తలతో ఆ రాష్టాల్లో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. స్థానికంగా తాము అలుపెరుగని పోరాటం సాగిస్తున్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే పార్టీ మనుగడ ఏమవుతుందోనన్నదే క్యాడర్ ఆందోళనకు కారణం. పైగా.. పైకి ఏం చెబుతున్నా.. ప్రశాంత్ కిశోర్ బీజేపీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఆ పార్టీతో ఇప్పటికీ లోపాయికారీగా కలిసి పని చేస్తున్నారన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాలలో విస్తృతంగానే ఉన్నాయి. సహజంగానే జాతీయ స్థాయిలో ఇప్పటికీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఈ అనుమానాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన పీకేను పార్టీ అధిష్ఠానంతోపాటు, ఆ పార్టీలోని సీనియర్ నాయకులు సైతం పూర్తిగా విశ్వసించలేదు. పార్టీలో చేరి పనిచేయాలని, అదే సమయంలో ఇతర పార్టీలకు అతడి సారథ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలందించడం నిలిపివేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పీకేకు సూచించినట్టు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి కాంగ్రెస్ పార్టీ సిద్దమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పీకే రూపొందించిన ప్రణాళికను అధ్యయనం చేసి, అమలు చేసేందుకు పార్టీ ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీలో పీకే కూడా చేరాలని అధిష్ఠానం కోరింది. పీకే ఆధ్వర్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు పొందడానికి దేశంలోని రాజకీయ పార్టీలు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. ఈ స్థాయిలో సాగుతున్న వ్యాపారాన్ని వదులుకోవడానికి పీకే సిద్ధంగా లేరని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.
ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రకటించిన పీకే అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపముందని, దానిని అధిగమించడమే ప్రధానమని కూడా వ్యాఖ్యానించడం ద్వారా ఆ పార్టీని పలుచన చేసే వ్యాఖ్యలు చేశారు. అసలు పీకే సూచించిన సమస్యలు ఆ పార్టీ నాయకత్వం దృష్టికి ఇప్పుడే కొత్తగా వచ్చినవేమీకాదు. వాటిని అధిగమించేందుకు ఆ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తోంది. ఢక్కామొక్కీలు తిన్న నాయకులకు, రాజకీయ వ్యూహకర్తలకు ఆ పార్టీలో కొదవ లేదు. అయితే మోదీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీ అవలంబిస్తున్నసోషల్ ఇంజనీరింగ్ విధానాలను ఎదుర్కోవడమే ఆ పార్టీకి సాధ్యం కావడం లేదు. బహుశా అందుకే ఆ పార్టీ పీకే లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మీద ఆధారపడేందుకు సిద్ధపడిందనుకోవాలి. ఈ ప్రయత్నం ఫలించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంతంగా ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుందో చూడాల్సి ఉంది.