ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వం ఇంకా తొలగిపోలేదని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అంతేకాదు దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. భారత్‌లో బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ‘బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు’ అనే అంశంపై ఐరాస మానవహక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి తొమోయా ఒబొకటా తన నివేదికను తాజాగా సమర్పించారు. బానిసత్వం, సామ్రాజ్యవాద భావన, ప్రభుత్వ ప్రాయోజిత వివక్ష వంటివాటితో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయని పేర్కొన్నారు.
భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, సోమాలియా, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, కజఖ్‌స్థాన్ వంటి దేశాల్లో మహిళలు, బాలికల బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని వెల్లడించారు. మరోవైపు- మైనారిటీ వర్గాలు, వలస కార్మికుల హక్కుల కోసం వివిద దేశాల్లో కార్మిక సంఘాలు విశేష కృషిచేస్తున్నాయని ప్రశంసించారు. భారత్, చిలీ, కంబోడియా, ఘనాల్లో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా నిలుస్తున్నాయంటూ కితాబిచ్చారు.