ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాలోని మౌలేఖల్ గ్రామానికి చెందిన శంభు దయాళ్ అనే వ్యక్తి టీ దుకాణం నడుపుతున్నాడు. అందులో 2-3 మాత్రమే కూర్చొని టీ తాగొచ్చు. ఎవరైనా ఫకీర్ లేదా పేదవాడు తన దుకాణానికి వచ్చి టీ తాగితే శంభు డబ్బులు తీసుకోడు. శంభు దయాళ్‌కు భార్య దేవకీదేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు దివ్యాంగులు.
“రామయ్య దయతోనే నా కుటుంబం బతుకుతోంది. నా గురువు నుంచి ప్రేరణ పొంది గత 35ఏళ్లుగా రామనామాన్ని రాస్తున్నాను. ప్రపంచ శాంతి కోసం రామయ్య పేరును కోట్లాది సార్లు లిఖిస్తున్నాను. ఇంకా రామయ్య నామాన్ని రాస్తూనే ఉంటాను. గిన్నిస్ బుక్ లో నా పేరు నమోదు కావాలనుకుంటున్నాను. జీవితాంతం రామనామాన్ని జపిస్తాను”అని రామ భక్తుడు శంభు దయాల్ తెలిపాడు.
35ఏళ్లుగా ”రామనామం”
శంభు దయాళ్‌కు రాముడు అంటే చాలా ఇష్టం. అతడి జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా రామయ్యపై భక్తి మాత్రం తగ్గలేదు. అందుకే గత 35 ఏళ్లుగా ఖాళీ దొరికినప్పుడల్లా రాముడి పేరును రాసేవాడు. ఇప్పటివరకు 35 కోట్ల సార్లు రామనామాన్ని పెన్నుతో రాశాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రామనామం రాయడం మర్చిపోననని చెప్పాడు శంభు. ప్రపంచ శాంతి కోసమే తాను రామనామాన్ని రాస్తున్నానని ఆనందంగా చెప్పాడు ఈ అపర రామ భక్తుడు .