Project Cheetah: చిరుత పులుల సంరక్షణ పై కేంద్రం ఫోకస్ పెట్టింది . ఇందులో భాగంగా చీతాల ఇబ్బందులపై ప్రచారం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు ఇక్కడ మనుగడ సాగించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపే ప్రాజెక్టుపై వెబ్‌సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది . ‘షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్’ పేరిట ఈ వెబ్‌సిరీస్ నాలుగు భాగాలుగా చిత్రీకరించడానికి ప్రణాళిక రచించారు .
సెప్టెంబరు 17 నాటికి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి ఏడాది అవుతుంది.ఆ సందర్భంగా సెప్టెంబర్ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టీసీఏ) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వైభవ్‌చంద్ర మాథుర్ ఓ లేఖ రాశారు. ప్రపంచ తొలి ఖండాతర బదిలీ చీతా ప్రాజెక్టుపై వెబ్‌సిరీస్ ప్రతిపాదనకు అథారిటీకి చెందిన 8వ సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. కునో నేషనల్ పార్కుతోపాటు గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణకు నిబంధనల పరిధిలో నిర్మాణసంస్థకు సహకరించవలసిందిగా ఆదేశించారు .
170 దేశాల్లో ప్రసారం
వివిధ భాషల్లో 170 దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్ ద్వారా ఈ వెబ్‌సిరీస్ ప్రసారం కానుంది. భారత్‌లో కనుమరుగైన చీతాలను మళ్లీ ఇక్కడకు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్న కష్టనష్టాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ సిరీస్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. భారత్‌కు నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 మొత్తం 20 చీతాలను ఇప్పటిదాకా తీసుకువచ్చారు. ఇందులో 8 మృతిచెందగా, చీతాలకు పుట్టిన 17 కూనల్లో 12 సజీవంగా ఉన్నాయి.