ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (WTSA 2024) ఈవెంట్ ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగానికి గ్లోబల్ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లే, డిజిటల్ ప్రపంచానికి కూడా నియమాలు, నిబంధనలు అవసరమని అన్నారు.
భారతదేశంలో 120 కోట్ల మొబైల్, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయంవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్- భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం మొబైల్ కాంగ్రెస్‌లోనే 5జీ సేవలను ప్రారంభించాం. దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా భారతదేశం అవతరించింది. ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం.