రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది . దేశ రాజధాని నగరం దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ, తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -4’ (GRAP-IV) కింద మరిన్ని నిబంధనలను నవంబర్ 18 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. దిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరగడం గమనార్హం. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు దిల్లీలోని పాఠశాలలు అన్నీ మూసివేసి, కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం ఆతిశీ ప్రకటించారు.
- దిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా)కు ప్రవేశాన్ని నిలిపివేయాలని CAQM ఆదేశించింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకు మాత్రం అనుమతిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలను మూసివేయడం సహా, సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) సూచించింది.
- ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్-4 వాహనాలు మినహా దిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం విధించారు. దిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్-4 లేదా అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
- అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేయాని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌లు, వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
- ఇప్పటికే 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా, తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.
- ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించారు.
- GRAP-4 ఆంక్షల ప్రకారం 11-12 తరగతులు మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేయనున్నట్లు సీఎం ఆతిశీ తెలిపారు. దీంతో స్కూళ్లన్నీ తాత్కాలికంగా మూతపడనున్నాయి.