దర్శక ధీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో తారక్ అనన్యసామాన్యమైన నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో అతడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడం మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయిలో సినీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఓటీటీలోనూ ఆర్ఆర్ఆర్ చిత్రం కొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ అవార్డు బరిలో ఉన్నట్టుగా వార్తలు రావడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ 2023 ఆస్కార్ నామినేషన్లలో తారక్ పేరు ఉన్నట్టు పేర్కొనడం విశేషం. దీంతో ఈ వార్త నెట్లో వైరల్ కాగా ఆయన అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఓ గిరిజన యువకుడిగా, తన తెగకు చెందిన బాలికను రక్షించడానికి ప్రాణాలు తెగించి నాటి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన యోధుడిగా తారక్ నటన హాలీవుడ్ ప్రముఖులను సైతం మెప్పించిన నేపథ్యంలో తారక్ అరుదైన గౌరవానికి అర్హుడేనని సినీ అభిమానులు అంటున్నారు. ఈ వార్త నిజమైతే ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఖ్యాతి దక్కించుకుంటారు.
కాగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ నెట్ సెర్చింజన్ గూగుల్ సైతం ఈ చిత్రానికి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చింది. గూగుల్ లో RRR అని టైప్ చేస్తే గుర్రం, బైక్ ఒకదానివెంట ఒకటి వెళుతున్నట్టు ఒక యానిమేషన్ చిత్రాన్ని క్రియేట్ చేసింది. దీనిపై ఈ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య గూగుల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.