అవును నిజమే… సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, టాలీవుడ్ క్రేజీ స్టార్ దళపతి విజయ్ అభిమానుల మధ్య కొద్దిరోజులుగా అక్షరాలా యుద్ధమే జరుగుతోంది. ఒక హీరోపై మరొక హీరో అభిమానులు ట్రోల్స్, మీమ్స్, మార్ఫింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎవరికి వారు తమ హీరోనే గొప్ప అంటూ అవతలి హీరోను కించపరచే చర్యలతో రెచ్చిపోతున్నారు. నిజానికి స్టార్ హీరోల మధ్య ఎంత స్నేహపూర్వక సంబంధాలున్నా.. ఇటు తెలుగునాట.. అటు తమిళనాడులోనూ సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఈ అభిమానుల అతి భరించలేకే కొన్నేళ్లుగా చాలామంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకూ మొగ్గు చూపలేదు.
అయితే ఇప్పటిదాకా ఇవి ఆయా భాషల్లోని హీరోలకే పరిమితం. తమిళంలో రజనీకాంత్- కమల్ హాసన్ అభిమానుల మధ్య, ఆ తరువాత విజయ్- అజిత్ అభిమానుల మధ్య ఈ రకమైన రచ్చ జరుగుతూ ఉండేది. తెలుగులోనూ ఇదే తరహాలో కొందరు హీరోల అభిమానులు వ్యవహరిస్తుండటం చాలాకాలంగా చూస్తున్నదే. కాగా ఇప్పుడు ఇది భాష, రాష్ట్ర పరిమితులను దాటి సాగుతుండటమే ఆందోళనకర పరిణామం.
తెలుగునాట సూపర్‌స్టార్ గా వెలుగుతున్న మహేష్ నిజానికి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. మిగిలిన హీరోలతో చాలా స్నేహపూర్వకం మెలుగుతారన్న పేరుంది. ఇక తమిళనాట తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్న విజయ్ కూడా అనవసర వివాదాల జోలికిపోరు. ఈ ఇద్దరికీ మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో తెలుగులో మహేష్ హీరోగా తెరకెక్కిన ఒక్కడు, పోకిరి వంటి చిత్రాలు కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా రీమేక్ అయి అక్కడా బ్లాక్‌బస్టర్ విజయాలందుకున్నాయి.
ఇక ఇప్పుడు ఇద్దరూ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండటమే కాక పాన్ ఇండియా చిత్రాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఇద్దరికీ ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న సమయంలో అభిమానుల మధ్యే అయినా.. ఇలాంటి గొడవలు పెరగడం పరిశ్రమకు మంచిది కాదని, దీనిపై ఆ ఇద్దరూ స్టార్ హీరోలు స్పందించి అభిమానులను కట్టడి చేస్తే మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కావాలని ఎవరైనా దురుద్దేశ పూర్వకంగా చేస్తున్నారేమో గమనించాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.