ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవిపై మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఆమె కశ్మీరీ పండిట్ల ఊచకోత, గోరక్షుల పేరుతో హత్యలకు పాల్పడిన వారిపై ఒక యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై రకరకాల మీడియాలు రకరకాలుగా ఆమెపై కథనాలు చేశాయి. వివాదాస్పదం చేశాయి. కొందరు సాయిపల్లవిని తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంపై సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సాయిపల్లవి ఆ వీడియోలో ఆరోపించారు.
మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెప్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, దానికి ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. తాను పెరిగిన వాతావరం రెండింటికీ మధ్యస్థంగా ఉందని కూడా చెప్పానని.. కాని తాను చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందే.. నేను మొదట ఓ డాక్టర్ ను, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు.. అంటూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలన్నారు. కొన్నిరోజులుగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించడానికి చాలా ఆలోచించాల్సి వచ్చిందని సాయిపల్లవి తెలిపారు. తన మాటలు ఎవరినీ బాధించకూడదనే భావిస్తానని స్పష్టం చేశారు.