దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీసు వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో ఏకకాలంలో అటు తారక్ ఇటు రాంచరణ్ ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా ఘనతను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. జక్కన్న ఈ చిత్రాన్ని మలిచిన తీరుకు హాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇక కోవిడ్ అనంతరం భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైనా తన సత్తా చాటుతోంది. జీ5, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ ప్లస్ వంటి ఓటిటి మాధ్యమాల్లో కూడా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది.
ఈక్రమంలోనే ఇప్పటిదాకా మరే భారతీయ చిత్రానికీ సాధ్యంకాని సంచలన రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ స్థాయిలో ఇప్పటివరకు ఏకంగా 10 వారాల పాటు టాప్ లో ట్రెండ్ అయిన నాన్ ఇంగ్లీష్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. భారత్ నుంచి మాత్రమే కాక పలు ఇతర దేశాల ఆడియెన్స్‌ని కూడా ఈ చిత్రం విశేషంగా మెప్పించడంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఈ స్థాయి విజయాన్ని సాధించడం వెనుక దర్శకుడు రాజమౌళిదే ప్రధాన పాత్ర అయినా ఇందులో కొమరం భీం పాత్రలో జీవించిన తారక్, రామరాజు పాత్రలో అద్భుతంగా మెప్పించిన చెర్రీల పాత్రనీ తక్కువ చేయలేం.