మాస్ మహారాజాగా వెండితెరపై వెలిగిన రవితేజ కెరీర్ గ్రాఫ్ ఇటీవలి కాలంలో యువ హీరోల తాకిడికి కాస్త జోరు తగ్గిన విషయం వాస్తవమే. అయితే వరుస పరాజయాల తరువాత రాజా ది గ్రేట్ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన ఈ విలక్షణ హీరో తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ పై మంచి అంచనాలు ఉన్నాయి. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా యువ దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పలు సినిమాల్లో హీరోగా నటించి చాలాకాలం వెండితెరకు దూరంగా ఉన్న వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా శనివారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ లాంచ్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఆరుగురు యువ దర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో ట్రైలర్ రిలీజ్ చేయించారు. రవితేజ ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందించినట్టు చాటుతున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకెళుతోంది. చాలాకాలం తరువాత రవితేజ తనదైన శైలి యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ తో దుమ్మురేపాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కీలక పాత్రల మధ్య సాగే ఎమోషన్స్, రొమాన్స్ వంటి అంశాలు ట్రైలర్ లో చూపించారు. 1995 సమయంలో జరిగే కథగా ఈ మూవీ స్టోరీ సాగనున్నట్లు సమాచారం. జూలై 29న ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీ రవితేజకు పునర్వైభవం తీసుకురావడం ఖాయమని చిత్రబృందం గట్టిగా చెపుతోంది.